తాను బాహుబలి గ్రాఫిక్స్ చూపించబోనని అన్నారు జగన్

అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ది హిందూ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ బుధవారం మాట్లాడారు. ఓ ముఖ్యమంత్రిగా తాను కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోతే దాని ప్రభావం భవిష్యత్తుపై పడుతుందని అన్నారు.

రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో ప్రస్తుతం రోడ్లు కూడా లేవని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు. అమరావతి నిర్మాణానికి 1.09 లక్షల కోట్లు అవసరమవుతాయని, మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఎకరానికి 2 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇటువంటి స్థితిలో అమరావతిని నిర్మించడం చాలా కష్టమని జగన్ అన్నారు.

అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కొనసాగుతుందని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉంటుందని చెప్పారు.

విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని అన్ని ప్రాంతాలకూ న్యాయం చేస్తామని, భవిష్యత్తు తరాలకు జవాబు దారీగా ఉండాలని అన్నారు.

ఐదేళ్లలో విశాఖను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రచించామని చెప్పారు .లక్ష కోట్లు ఖర్చు పెట్ట లేకనే పాలన వికేంద్రీకరణను చేపట్టామని చెప్పారు. తాను బాహుబలి గ్రాఫిక్స్ చూపించబోనని, లేనివి చూపించి ప్రజలను మోసం చేయలేనని చెప్పారు

సింగపూర్, జపాన్ తరహా గ్రాఫిక్స్ చూపించలేనని అన్నారు. తాను ఎవరినీ తప్పు పట్టాలని అనుకోవడం లేదని అన్నారు.తాను ఎంత చేయగలుగుతానో అంతే చెప్తానని అన్నారు.

విశాఖపట్నంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుందని జగన్ చెప్పారు. అమరావతిపై పెట్టే ఖర్చులో పదిశాతం ఖర్చు చేస్తే విశాఖ హైదరాబాదు, బెంగుళూర్, ముంబైలతో పోటీ పడుతుందని అన్నారు.

రాయలసీమలో తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని, రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 2 వేల కోట్లు కావాలని అన్నారు. 1600 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. 3 వేల టీఎంసీల గోదావరి నీరు వృధాగా పోతోందని అన్నారు.

ఇంగ్లీష్ ద్వారానే పోటీ ప్రపంచంలో నెగ్గురాగలమని తాను రాష్ట్రానికి తండ్రి వంటి వాడినని, ఒక్క తండ్రి తన పిల్లవాడిని ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పించాలని అనుకుంటాడని అన్నారు. ఇంగ్లీష్ మీడియం లగ్జరీ కాదని, అవసరమని ఆయన అన్నారు.