ఏపీలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆశాజనకంగా పాలిస్తోంది : బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి

మసీదులు, చర్చి ల విషయాల్లో జోక్యం చేసుకోని ప్రభుత్వాలు హిందూ దేవాలయాలపైనే ఎందుకు పెత్తనం చెలాయిస్తున్నాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు.గ్లోబల్‌ హిం దూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌, సేవ్‌ టెంపుల్స్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో, తిరుమలలో మీడియాతోనూ ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఉన్న హిందూ దేవాలయాలను ఆ యా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఆదాయం పెరిగే ఆలయాలన్నింటినీ ప్రభుత్వాలు అధీనంలోకి తీసుకుంటున్నాయన్నారు. లౌకిక ప్రభుత్వాలు ఏ మతానికి చెందిన ఆలయల్లో జోక్యం చేసుకోరాదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం ప్రభుత్వాలకు ఆలయాల ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దే అధికారం మాత్రమే ఉంది తప్ప, ఇతర అంశాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. కానీ దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను పూర్తి గా సివిల్‌ సర్వెంట్లతో ప్రభుత్వాలు నడిపిస్తున్నాయని, వారికి పూజారుల విధుల గురించి ఏమాత్రం అవగాహన లేదన్నారు. ప్రభుత్వ పెత్తనం తప్పించి స్వతంత్రంగా నడిపించేందుకే దేశవ్యాప్తంగా సేవ్‌ టెంపుల్స్‌ ఉద్యమం మొదలు పెట్టామన్నారు. అయోధ్యలో రామజన్మభూమి తరహాలోనే మధుర, వారణాశి ఆలయాలను కూడా పరిరక్షించుకోవాల్సిన అవరసరముందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆశాజనకంగా పాలిస్తోందని, గత పాలనలో జరిగిన అవినీతిని తిరగదోడి సరిచేయడానికి పూనుకుందని కితాబిచ్చారు. తిరుమలను క్రైస్తవ కేంద్రంగా మారుస్తున్నారంటూ జగన్‌పై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్యమతస్తుడంటూ చేసిన ప్రచారంలో వాస్తవంలేదన్నారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలకు లెక్కలు లేవని, టీటీడీలో ఆడిటింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. గడిచిన ఐదేళ్లలో స్వయం ప్రతిపత్తి సంస్థ ద్వారా ఆడిటింగ్‌ జరగలేదన్నారు. టీటీడీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సిట్‌తో విచారణ చేయాలని సీఎం జగన్‌ను కోరానని చెప్పారు. టీటీడీని అన్యమతస్తులతో నిం పారని ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే మొదట తానే స్పందిస్తానన్నారు. టీటీడీలో 44మంది సిబ్బందిని అన్యమతస్తులుగా గుర్తించారని, వారిని తొలగిస్తామని అధికారులు చెప్పారని వివరించారు.