జగన్ సర్కార్ ఆర్టీసీ కి న్యూ ఇయర్ గిఫ్ట్

YS Jagan సర్కారు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు నూతన సంవత్సర కానుక అందిస్తోంది. జనవరి 1 నుంచి 50 వేల మందికిపైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. నూతన సంవత్సరం వేళ.. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరంలో తొలి కార్యక్రమంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో స్పందన కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుందన్నారు. ఈ ఏడాది తొలి కార్యక్రమం ఇదేనన్న సీఎం.. ప్రజా ప్రతినిధులు డిపోల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. 50 వేలకు పైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల చిరకాల వాంఛను నెరవేర్చామని సీఎం తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన జగన్ సర్కారు.. ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థను ప్రజా రవాణా శాఖగా మార్చేసింది. అధికారుల హోదాను కూడా ప్రభుత్వం మార్చేసింది. ఆర్టీసీ ఎండీ హోదాను పీటీడీ కమిషనర్‌ లేదా డైరెక్టర్‌గాను, ఈడీలను అడిషనల్‌ కమిషనర్లుగా, ఆర్‌ఎంలు జాయింట్‌ కమిషనర్లుగా, డీవీఎంలు డిప్యూటీ కమిషనర్లుగా, డిపో మేనేజర్లను అసిస్టెంట్‌ కమిషనర్లుగా పేర్కొనాలని ఇదివరకే జీవో జారీ చేశారు. కొత్తగా 2059 వ్యాధులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర పథకాలు లబ్దిదారులకు తప్పకుండా చేరాలని సీఎం ఆదేశించారు. అర్హులైతే చాటు వైఎస్సార్సీపీకి ఓటేయని వారికి కూడా పథకాలను వర్తింపజేయాలన్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, రేషన్‌ కార్డులు, పెన్షన్లు తదితర పథకాలకు సంబంధించి అర్హతలు, జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్రాంతి నాటికి ప్రదర్శించాలన్నారు.