జగన్‌ నివాసానికి అనుమతుల్లేవ్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసం ఉంటున్న ఇంటికి సిఆర్‌డిఎ అనుమతులు లేవని, ప్రజావేదిక అక్రమ కట్టడమని కూల్చిన సిఎం ఇప్పుడు తన ఇంటిని కూలగొడతాడా? అని టిడిపి మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్‌కుమార్‌, బోండా ఉమామహేశ్వరరావులు ప్రశ్నించారు. మంగళగిరిలోని టిడిపి జాతీయ కార్యాలయంలో శుక్రవారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. రాజధానికి కూతవేటు దూరంలోనే 2015-16 మధ్యన జగన్‌ బినామీలు, కంపెనీలు పెద్దఎత్తున భూములు కొన్నారని, వైఎస్‌ భారతి, సండూర్‌ పవర్‌, హరీశ్‌ ఇన్‌ఫ్రా కంపెనీలను విచారణ పరిధిలోకి తీసుకొచ్చే ధైర్యం జగన్‌కు ఉందా?అని వారు ప్రశ్నించారు. 2019 ఫిబ్రవరిలో జగన్‌ తాడేపల్లిలో గృహప్రవేశం చేశారని, ఆ ఇంటిని ఎవరిదగ్గర కొన్నారో స్పష్టం చేయాలన్నారు. ఆ ఇల్లు కాంక్రీట్‌ అండ్‌ లైట్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా యజమాని అనిల్‌కుమార్‌రెడ్డిదని, అయన నుంచి కొన్నట్లు ఆధారాలున్నాయన్నారు. ఈ కంపెనీ 2016 నుంచి పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసిందన్నారు.

భూములు కొనుగోలు చేసిన ఆయా కంపెనీలు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నాయని, ఆయా కంపెనీల వెనుక జగన్‌ భార్య భారతి, పి.రమేష్‌బాబు ఉన్నారన్నారు. రాజధాని ప్రాంతంలో తనకు భూములు లేవంటున్న ఆళ్ల తన అఫిడవిట్‌లో పేర్కొన్న భూములు ఎవరివని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి 2019లో ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్‌లో సిఆర్డీఏ పరిధిలో వివిద సందర్భాల్లో 2018వరకు కొనుగోలు చేసిన భూమి 62.98 సెంట్లు, ఆయన భార్య రాధ పేరుతో 8ఎకరాలు భూమి ఉందన్నారు. గుంటూరు జిల్లాలోని పెదకాకాని, తాడేపల్లి, ఫిరంగిపురం, గుంటూరు, నల్లపాడు , తాళ్లూరు, వేమవరంల్లో ఆయనకు ఆస్తులున్నాయని టిడిపి నేతలు పేర్కొన్నారు