బోస్టన్‌పై చంద్రబాబు ఆగ్రహం

ఏపీకి మూడు రాజధానులు, ఆరు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళంటూ బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ఇచ్చిన నివేదిక ఓ చిత్తు కాగితమని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. తాను తయారు చేసిన విజన్ 2029 రిపోర్ట్‌లోని పాయింట్లను కాపీ కొట్టేసి బోస్టన్ గ్రూపు నివేదిక రూపొందించిందని అన్నారాయన. బోస్టన్ కమిటీకి విశ్వసనీయత లేదని చంద్రబాబు తెలిపారు.

తమ ప్రభుత్వ హయాంలో తాము తీసుకొచ్చిన ఇన్వెస్టమెంట్లను రాష్ట్రానికి రాకుండా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన వెంటనే ఇక్కడకు ఎన్నో సవస్థలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయని, ఇపుడు రాజధానిపై జగన్ ప్రభుత్వం గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేయడంతో వారంతా వెనక్కి వెళ్ళిపోతున్నారని అన్నారు చంద్రబాబు.

బోస్టన్ కన్సల్టెన్సీ ఇష్టం వచ్చినట్టు నివేదిక ఇచ్చి ప్రజల జీవితాలతో ఆటలాడుతుందని, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్‌ని బేస్ చేసుకుని అప్పటి ప్రభుత్యం నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మీరెవ్వరు మార్చడానికని ఆయన ప్రశ్నించారు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతి రాజధాని మార్పు ఉండదని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన వీడియో ప్రదర్శించారు చంద్రబాబు. అదే సమయంలో అజయ్ కల్లాం చెప్పినట్లుగా జిఎన్ రావు కమిటీ నివేదిక రూపొందిందని చంద్రబాబు ఆరోపించారు. రిపోర్టులు అన్ని తప్పులు తడకగా వున్నాయని, నిజానికి విశాఖపట్నాన్ని మెగా సిటీగా తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకున్నారు.

ప్రకృతి ద్వారా ఎలాంటి ఉపద్రవం వచ్చిన పవర్ సమస్యలు తలెత్తకుండా అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా తమ ప్రభుత్వమే వేసిందని ఆయన వివరించారు. విశాఖపట్నంని బెస్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి అనేక ప్రణాళికలు వేసామని చెప్పుకున్నారు చంద్రబాబు. కర్నూలులో అతిపెద్ద సోలార్ సిస్టమ్‌ని సెటప్ చేసామని, ఇలా అన్ని ప్రాంతాలకు కావసినవి ఇచ్చి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేశామని చంద్రబాబు వివరించారు.

వాటర్ బాడీస్‌కి 5 కిలో మీటర్లు దూరంలో నగరం కట్టాలని చెప్తున్నారని, మరి పారిస్, ఢిల్లీ, దుబాయ్ లాంటి నగరాలను ఎలా కట్టారని చంద్రబాబు ప్రశ్నించారు. అద్భుతమైన కృష్ణా నదీ తీరాన రాజధానికి అద్భుతమైన రూపకల్పన చేస్తే చెడగొడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురం నుంచి విశాఖపట్నానికి 915 కిలో మీటర్ల దూరమని, పులివెందుల, కడప, రాయలసీమ జిల్లాల నుంచి విశాఖపట్ననికి రావాలంటే ఎంతో కష్టమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాంటి చోట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ తింగరి మాటలు మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.