బీజేపీలో చేరిన యామిని సాధినేని

ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన సాదినేని యామిని శర్మ బీజేపీలో చేరారు. శనివారం కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరితో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

2019 నవంబర్ లో టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని తన రాజీనామా లేఖలో తెలిపారు.

వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతోనే టీడీపీని వీడుతున్నట్టు చెప్పారు.

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన యామిని శర్మ.. ఎన్నికల సమయంలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆమె పార్టీ మారతారని జోరుగా ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కూడా కలవడంతో.. కమల దళంలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. అది జరిగి 2 నెలల తర్వాత అధికారికంగా బీజేపీలో చేరారు.

కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చారు. సీఏఏపై అవగాహన కల్పించేందుకు కడపలో బీజేపీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలకు సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)పై అవగాహన లేకపోవడంతోనే ప్రజలను రెచ్చగొడుతున్నాయని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఈ చట్టం ఏ ఒక్క మతానికి, కులానికి సంబంధించినది కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి చెప్పారు. దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. దేశ భద్రత కోసం చట్టాలు తెస్తే వ్యతిరేకించడం తగదన్నారు. పౌరసత్వ చట్టానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కరెక్ట్ కాదన్నారు.