జగనన్న దీవెనలకు రూ.5,500 కోట్లు

పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన జగనన్న విద్యా, వసతి దీవెనల పథకాలకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేయూతను అందించనుంది. ఈ రెండు పథకాల ద్వారా సుమారు రూ. 5,500 కోట్లు వెచ్చించనుంది. జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజు రియంబర్స్‌మెంట్‌ (ఆర్‌టిఎఫ్‌) కోసం రూ.3300, జగనన్న వసతి దీవెనకు వసతి, భోజనం (ఎంటిఎఫ్‌) సౌకర్యాల కోసం మరో రూ.2200 కోట్లు ఖర్చు చేయనుంది. గతేడాది వరకు రూ. 2537 కోట్లతో విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించే వారు. ఈ విద్యా సంవత్సరంలో రూ.3300 కోట్లతో ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలని నిర్ణయించారు.

గతంతో పోల్చితే ప్రస్తుతం అదనంగా మరో రూ. 750 నుంచి రూ. 800 కోట్ల వరకు కేటాయించనున్నారు. అదేవిధంగా రూ.2200 కోట్లతో జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు.

గతేడాది వరకు రూ.800 కోట్లు మాత్రమే ఎంటిఎఫ్‌ కింద చెల్లించేవారు. గతేడాదిదో పోల్చితే ప్రస్తుతం రూ.1400 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పథకాల కోసం రూ. 5030 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

గత ఐదేళ్లల్లో ఫీజు రియంబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజన సౌకర్యాల కోసం కేటాయించిన నిధులు కూడా తక్కువే. వీటి కోసం కేటాయించిన నిధులు రూ. 3వేల కోట్లకు మించలేదని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్లు ఎక్కువగా కేటాయించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్టిన కేటాయింపుల కంటే ఖర్చు చేయనున్న నిధులు ఎక్కువగా ఉన్నాయి. సుమారు రూ.470 కోట్లు అదనంగా కేటాయించాల్సి ఉంది. ఈ రెండు పథకాల ద్వారా సుమారు 12లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ చెల్లింపులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ విద్యా సంవత్సరం ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు