రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి

వైసీపీ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోవడమే కాకుండా రెవెన్యూ వ్యయం పెరిగినందున ఆర్టికల్ 360 కింద ఆర్థిక అత్యయిక పరిస్థితిని రాష్ట్రంలో విధించాలని ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. మూలధన వ్యయం 10,486 కోట్లు తగ్గిందని, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు ఇవ్వడమే కష్టంగా మారిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్షేమంపై 2వేల కోట్లు నిధులు తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారన్నారు. టీడీపీ ప్రభుత్వ పథకాలను రద్దుచేసి కోతలు విధించారని, చేతగాని విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు. మూలధన వ్యయంలో మూడింట రెండు వంతులు కోతలు విధిస్తే భవిష్యత్తులో ఆదాయం పెరగదన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ఐదు శాతం పెరిగి తలసరి ఆదాయం రెండేళ్ల దిగువకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్ధిని రివర్స్ చేశారని, దీంతో పేదల సంక్షేమం కూడా రివర్స్ అయ్యిందన్నారు. రాజకీయ సంక్షోభంలో వైసీపీ చిక్కుకుందని, రాష్ట్రానికి, జాతికి సరిదిద్ద లేని నష్టం చేశారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశామన్న పిచ్చి ఆనందమే జగన్‌కు మిగిలిందని యనమల పేర్కొన్నారు.