దిల్లీ ఎన్నికలకు మోగిన నగారా

దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా తెలిపారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరుగుతుందని.. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు.

ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని అరోడా చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 13,767 పోలింగ్‌ కేంద్రాలు, 90వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.

దిల్లీలో నేటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని అరోడా స్పష్టం చేశారు. మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) మరోసారి అధికారం చేపట్టాలని ఆశిస్తోంది. గత ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 స్థానాల్లో ఆప్‌ గెలుపొందింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ అసెంబ్లీ పరిధిలో ఉన్న 7 లోక్‌సభ స్థానాలను గెలిచిన భారతీయ జనతా పార్టీ (భాజపా) అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తన పూర్వవైభవం కోసం పట్టుదలతో ఉంది.

దిల్లీ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్‌- జనవరి 14

నామినేషన్ల ముగింపు- జనవరి 21

నామినేషన్ల పరిశీలన- జనవరి 22

నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 24

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 8

ఓట్ల లెక్కింపు- ఫిబ్రవరి 11