మొత్తం కుట్రను తేలుస్తానంటున్న రోజా

ఏపీఐఐసీ ఛైర్మెన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆమె సొంత నియోజకవర్గంలో జరిగిన దాడి పార్టీ అధిష్టానం ముందుకు చేరనుంది. జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఈ దాడి ఇప్పటికిప్పుడు ఏదో ఆవేశంతో జరిగింది కాదని రోజా వాదిస్తున్నారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వాళ్ళే తన విజయాన్ని జీర్ణించుకోలేక నాలుగు నెలలుగా ప్లాన్ చేసి మరీ తనపై దాడి చేయించారంటూ జిల్లా రాజకీయాల్లో కీలక వ్యక్తులు ఈ దాడి వెనుక సూత్రధారులు అన్న సంకేతాల్నిచ్చారు రోజా.

రోజా మాటలపై జిల్లా పార్టీ వర్గాలు తలో రకంగా చెప్పుకుంటున్నాయి.

పార్టీలో మొదట్నించి పెద్దరికం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనే రోజా అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. రాజకీయంగా ఎదగనీయకుండా మొన్నటి ఎన్నికల్లో తనను ఓడించేందుకు పెద్దిరెడ్డి వర్గం ప్రయత్నించిందని రోజా అనుమానిస్తున్నారు. తన సొంత చరిష్మాకు జగన్ అండ తోడవడంతో 2 వేల ఓట్లతో గట్టెక్కానని అంటున్న రోజా.. తనను ఓడించిన వర్గమే ఇప్పుడు తనపై దాడికి కుట్ర చేసిందని చెబుతున్నారు.

రోజా ఓటమికి సీనియర్ నేత, ప్రస్తుత రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం యత్నించిందన్నది రోజా ఆరోపణ. ఈ మేరకు అధినేత జగన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు రోజా సిద్దమవుతున్నారు. మంత్రివర్గం ఏర్పాటైన సందర్భంలోను తనకు పదవి రాకుండా పెద్దిరెడ్డి యత్నించి, సక్సెస్ అయ్యారని రోజా భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో రోజా పార్టీకి చేసిన సేవను గుర్తించిన జగన్.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా.. అత్యంత కీలకమైన ఏపీఐఐసీ ఛైర్మెన్ పదవి ఇచ్చారని, రెండున్నరేళ్ళ సూత్రంలో తనకు భవిష్యత్‌లో జగన్ మంత్రి పదవి ఇస్తారన్న విశ్వాసంతో రోజా ఉన్నారని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు.

తాజా దాడి నేపథ్యంలో రోజా, పెద్దిరెడ్డి మధ్య వున్న విభేదాలు బహిర్గతమయ్యాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ దాడిని ఇంతటితో వదలకుండా.. తనపై జిల్లాలో జరుగుతున్న కుట్రలన్నింటినీ జగన్ దృష్టికి తీసుకువెళ్ళేందుకు రోజా రెడీ అవుతున్నారని, నేడో, రేపో ఆమె అధినేతను కలిసే అవకాశం వుందని భావిస్తున్నారు. ఈ విశ్లేషణతో రోజా వర్గం దాదాపు ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తోంది