విశాఖలో జగన్ నివాసం ఎక్కడో తెలుసా?

ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖనగరం ఆల్‌మోస్ట్ కన్‌ఫర్మ్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాగర తీర నగరంలో ఎక్కడ ఉండబోతున్నారు? ఇదిప్పుడు వైసీపీతోపాటు సామాన్య వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. హుదుద్ తుఫాను తాకిడికి పెద్ద ఎత్తున విధ్వంసమైన విశాఖ సిటీ ఆ తర్వాత సంవత్సరన్నర కాలంలోనే మరింత సుందరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖ త్వరలోనే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడ వుండబోతోంది? జగన్ సొంత నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు?

అన్ని అనుకున్నట్లుగా జరిగితే జనవరి మాసాంతానికి విశాఖ నగరం ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. వైజాగ్ సిటీలో సుందర ప్రాంతాలతోపాటు.. భారీ భద్రతతో కూడుకున్న ఏరియాలు, అత్యంత సంపన్న కాలనీలు ఎన్నో వున్నాయి. వాటిని పరిశీలిస్తే.. ముందుగా మనకు గుర్తొచ్చేది… ఆర్.కే. బీచ్ ఏరియా. తూర్పు తీర బంగాళాఖాతంలో ప్రతీ సూర్యోదయం ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా నిలుస్తుంది. . అందుకే ఎక్కువ మంది జగన్ నివాసాన్ని సముద్ర తీరంలో సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకుంటున్నారు. ఆర్కే బీచ్ నుంచి కైలసగిరి మధ్య ప్రాంతంలోని పలు ప్రభుత్వ స్థలాలను ఇందుకోసం అధికారులు ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం. ముఖ్యంగా కైలాసగిరి సమీపంలో ఎత్తైన ప్రాంతం ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలంగా వుంటుందని, దాన్ని సెక్యూరిటీ పరంగాను మంచిగా మార్చొచ్చని పలువురు చెప్పుకుంటున్నారు.

భద్రతకే పెద్దపీట వేస్తే.. నేవీ ఏరియాలోని కొన్ని ప్రదేశాలలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతోపాటు, ముఖ్యమంత్రి నివాసాన్ని నిర్మించే అవకాశాలున్నాయన్నది మరికొందరు వాదన. ఈ ఏరియా అయితే.. ప్రస్తుతం వున్న విశాఖ ఏయిర్‌పోర్టుకు చాలా దగ్గరగా వుంటుంది. అయితే.. భవిష్యత్తులో భోగాపురం ఏయిర్‌పోర్టును అభివద్ధి పరిచే ఉద్దేశం వుండడంతో.. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయకపోవచ్చ అన్నది మరికొందరు అంఛనా.

నగరంలో అత్యంత సంపన్నమైన ప్రాంతం… అంటే హైదరాబాద్‌లో జూబిలీహిల్స్ వంటి ప్రాంతం విశాఖలో సీతమ్మధార ఏరియా. ఆ ఏరియాను ముఖ్యమంత్రి నివాసానికి ఎంపిక చేసుకోవచ్చని, క్యాంపు కార్యాలయంగా అత్యంత సెక్యూరిటీతోపాటు అన్ని సౌకర్యాలు వున్న సర్క్యూట్ హౌజ్‌ని వినియోగించుకుంటారని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో భీమిలీ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా అందుబాటులో వున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో మంత్రుల నివాసాలతోపాటు.. ముఖ్యమంత్రి నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్న చర్చకూడా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఏది ఏమైనా … విశాఖ ఇప్పుడు ఏపీలో నెంబర్ వన్ సిటీగా వుంది. రాజధానిగా మారితే మరింత వేగంగా సిటీ విస్తరించే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. కనెక్టివిటీ పరంగాను మిగిలిన నగరాలతో పోలిస్తే విశాఖ చాలా మెరుగ్గా వుంది. అంతర్జాతీయ విమాన సర్వీసుల పరంగానూ విశాఖ నగరం చాలా ముందుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థ రాకపోకలకు అత్యంత అనుకూలమైన విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే.. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయన్నది స్థానికుల అభిప్రాయం. దీనికి అనుగుణంగానే పాపులర్ ప్లేస్‌లో ముఖ్యమంత్రి క్యాంపాఫీస్, రెసిడెన్స్ వుండాలన్నది పలువురి అభిప్రాయంగా కనిపిస్తోంది.