ప్రజాభిప్రాయం కోరుదాం సీఎం జగన్ వ్యూహం ఇదే

తన ఏడు నెలల పాలనపైన ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్న పార్టీ ప్రస్తుత స్థితి గతుల పైనా ఆయన సర్వే సంస్థల ద్వారా సమాచారం సేకరించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తాను ప్రకటించిన నవరత్నాలను అమలు చేయటం ద్వారా ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనే దాని పైన ఫోకస్ చేసారు. ప్రస్తుతం రాజధాని రగడ కొనసాగుతున్న సమయంలోనే ప్రజల వద్దకు వెళ్లి..ప్రభుత్వం..పాలన పైన వారి అభిప్రాయం తీసుకొనేందుకు సీఎం సిద్దమయ్యారు.

అందు కోసం ముందుగా జిల్లా పరిషత్ ఎన్నికలు..ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు.

వీటి గురించి చర్చించి..తుది నిర్ణయం అదే విధంగా బాధ్యతలు అప్పగించేందుకు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఈ కీలక భేటీలో సీఎం తన వ్యూహం ఏంటో స్పష్టత ఇవ్వనున్నారు..

ఏడు నెలల పాలనపై ప్రజాభిప్రాయం..
ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అందు కోసం ముందుగా జిల్లా పరిషత్ ఎన్నికలు..ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు..ఆ తరువాత పంచాయితీ ఎన్నికలు నిర్వహించే దిశ గా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేడర్ ను సమాయత్తం చేయటానికి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులతో కీలక భేటీ ఏర్పాటు చేసారు.

ఈ ఏడు నెలల కాలంలో పార్టీ బలం పెరిగిందా..తగ్గిందా అనే కోణంలో ఇప్పటికే చేయించిన సర్వేల వివరాల ఆధారంగా మంత్రులకు సీఎం దిశా నిర్ధేశం చేయనున్నారు. జిల్లాల్లో పరిస్థితుల పైనా మంత్రుల నుండి ఆరా తీస్తారు. పార్టీ నేతల మధ్య సయోధ్య, బలోపేతానికి తీసుకున్న చర్యలపై జగన్‌ ఆరా తీస్తారు. పార్టీ గుర్తుపై స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మఒడిని తొలుత ఈ నెల 26న ప్రారంభించాలని భావించారు. అయితే, దానిని ముందుగానే ఈ నెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అదే విధంగా ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ముందుగా రిజర్వేషన్ల అంశం మీద ఫోకస్ చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో జిల్లా మంత్రులు..ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రణాళికపై ఇన్‌చార్జి మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఆలయ, మార్కెట్‌ కమిటీల నియామకాలకు సం బంధించి ఒకటి రెండో రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో జిల్లాల వారీగా పార్టీ..ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను వివరించటంతో పాటుగా పధకాల అమలు పైనా సమీక్షించనున్నారు.

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. దీని పైన ఈ నెలలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ఆమోద ముద్ర వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ ప్రతిపాదనల పైనా మూడు ప్రాంతాల్లోనూ పార్టీ రాజకీయంగా బలం పెంచుకొనే అవకాశం ఉందని సీఎం అంచనా వేస్తున్నారు.

అయితే, అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల పైన ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. వారి విషయంలో ఏం చేస్తే బాగుంటుంది..రాజధాని వ్యవహారం పైన రాయలసీమ..ఉత్తరాంధ్ర ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం నెలకొందనే అంశం మీద సీఎం సర్వే చేయించినట్లు సమాచారం. ఈ అంశం మీద కూడా జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల చర్చించి..ప్రాంతాల వారీగా మంత్రుల అభిప్రాయం సేకరించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా.. రానున్న రోజుల్లో పార్టీ.. ప్రభుత్వం పరంగా అమలు చేసే నిర్ణయాలు..రాజకీయ వ్యూహాలకు ఈ సమావేశంలో తుది రూపు ఇవ్వనున్నారు.