ఏపీలోని విద్యార్థులందరికీ తాను ఇకపై కేర్ టేకర్....

మధ్యాహ్న భోజనం పథకం మెనూలో మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతిష్టాత్మక అమ్మఒడి పథకాన్ని జగన్ గురువారం చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో మార్పులను గురించి ప్రస్తావించారు. ఇదే సమయంలో ఆయాలకు గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

కొత్త మెనూ:

సోమవారం: అన్నం, చారు, ఎగ్‌కర్రీ, స్వీట్, చిక్కీ
మంగళవారం: పులిహోర, టమోటో పప్పు, గుడ్డు
బుధవారం: వెజిటెబుల్ రైస్, ఆలూ కుర్మా, గుడ్డు, స్వీట్, చిక్కీ
గురువారం: కిచిడీ, టమోటా చట్నీ, గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, స్వీట్, చిక్కీ
శనివారం: అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్

అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల మంది విద్యార్ధులకు అమ్మఒడి పథకం మేలు చేస్తుందని.. అమ్మఒడి డబ్బులను బ్యాంకులు పాత అప్పులుగా సరిచేసుకునేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని జగన్మోహన రెడ్డి తెలిపారు.

ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6,456 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పేద విద్యార్ధుల సంక్షేమం కోసమే ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చామని.. పిల్లల చదువుకు కావాల్సిన అన్ని వస్తువులు ఫ్రీగా ఇస్తామన్నారు.

ఈ ఏడాది విద్యార్ధులకు 75 శాతం హాజరు మినహాయిస్తామని, ఆ తర్వాత విద్యా సంవత్సరం నుంచి 75 శాతం హాజరు తప్పనిసరని సీఎం తెలిపారు. మ్యానిఫెస్టోలో చెప్పింది 1 నుంచి 10వ తరగతి వరకే అని చెప్పామని.. కానీ ఇంటర్మీడియట్ వరకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని జగన్ వెల్లడించారు.

ఒకటి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నామన్నారు. అయితే తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందని, ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామని జగన్ పేర్కొన్నారు.

ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని, తెలుగు మీడియం విద్యార్ధులు ఇబ్బంది పడకుండా బ్రిడ్స్ కోర్సులూ తీసుకొస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. టీచర్స్‌కు సైతం ట్రైనింగ్ ఇస్తామన్నారు.