విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు

మూడు రాజధానులు..విశాఖకు పరిపాలనా రాజధాని వివాదం నడుమ రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ పైన చర్చ సాగింది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి రిపబ్లిక్ డే వేడుకలు కావటంతో..ప్రభుత్వం వీటిని ఎక్కడ నిర్వహిస్తుందనే దాని పైన ఆసక్తి నెలకొని ఉంది. అయితే, రాజధానుల వ్యవహారం ఎలా ఉన్నా..రిపబ్లిక్ డే వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు.గణతంత్ర వేడుకల నిర్వహణ వేదికపై ఉన్న సందిగ్ధత తొలిగిపోయింది.రాజధానుల మార్పు వ్యవహారంతో ఈ సారి ఘణతంత్ర వేడుకలు విశాఖలోనా..లేక విజయవాడలోనే అనే చర్చ సాగింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక సమర్పించిన తరువాత..కేబినెట్ లో చర్చించి..అసెంబ్లీలో ఆమోదించాలనే కార్యాచరణ ప్రభుత్వం ఖరారు చేసింది.

దీంతో..ఈ నెల 26న గణతంత్ర వేడుకలు ఎక్కడ నిర్వహించాలనే దాని పైన భిన్న వాదనలు వినిపించాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామా లు..అమరావతి ప్రాంతంలో చోటు చేసుకుంటున్న ఆందోళనలతో ఈ సారి విజయవాడలోనే ఈ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ను వేదికగా ఖరారు చేసారు. ఈ మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.రిపబ్లిక్ డే వేడుకలు విజయవాడలోనే నిర్వహించాలని నిర్ణయించటంతో..ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వేడుకలు జరిగే ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ను పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకల ఏర్పాట్ల పైన సూచనలు చేసారు. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో వేడుకల నిర్వహణ బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు.

గవర్నర్ విజయవాడలోనే ఉండటం..ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించటంతో పాటుగా..అదే రోజు సాయంత్రం రాజ్ భవన్ లో హై టీ ఏర్పాటు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఏ అంశాలను పొందు పర్చాలే అనే అంశం పైన జీఏడి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ పధకాల గురించి అందులో ప్రధానంగా వివరించే అవకాశం కనిపిస్తోంది.