ఉద్యోగులకు సెలవులు రద్దు: కేబినెట్ మీట్..వెంటనే..!

మూడు రాజధానుల నిర్ణయం ఎలాగైనా అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. ఈ నెలాఖరులోగా అధికారిక ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ రెండు సార్లు భేటీ అయింది. 13న మరోసారి సమావేశం కానుంది. అయితే, ఈ కమిటీ నివేదిక ఈ నెల 20న ప్రభుత్వానికి అందుతుందని..ఆ తరువాత కేబినెట్ సమావేశం లో ఆమోదించి..ఆ వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తారని భావించారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మరింత వేగం పెంచినట్లు కనిపిస్తోంది. సెలవుల తరువాత ఉద్యోగులకు ఐచ్చిక ..వారాంతపు సెలవులను రద్దు చేసింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేసింది.దీంతో..వచ్చే వారాంతంలోనే ప్రభుత్వం అధికారిక ప్రక్రియ పూర్తి చేసే వ్యూహాలు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశం కోసం రెండు ముహూర్తాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.శాసనసభా వేదికగా ముఖ్యమంత్రి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించిన సమయం నుండి ఆ దిశగా ప్రభుత్వం వేగంగా మందుకు వెళ్తోంది. జీఎన్ రావు...బోస్టన్ కమిటీలు ప్రభుత్వ ఆలోచనలకు వీలుగానే నివేదికలు ఇచ్చాయి. ఈ రెండింటిపైనా అధ్యయనం చేసి..నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ రెండు సార్లు భేటీ అయింది. తాజాగా, సంక్రాం తి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం 15న అధికారిక సెలవు ఇచ్చింది. 16న ఐచ్ఛిక సెలవు. 17న సెలవు పెడితే.. 18న వారాంతపు సెలవు వస్తోంది. 19న ఆదివారం. వరుస సెలవులు రావడంతో.. 16న ఐచ్ఛిక సెలవు పెట్టిన సచివాలయ ఉద్యోగులు.. 17 న సెలవు కోసం దరఖాస్తు చేశారు. వారందరికీ శాఖాధిపతులు సెలవులు కూడా మంజూరు చేశారు. కానీ శుక్రవారం ఆకస్మికంగా.. 17, 18వ తేదీల్లో ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని శాఖాధిపతుల పేరిట సర్క్యులర్‌ జారీ అయింది. 16న ఐచ్ఛిక, 17న సెలవుల కోసం చేసిన దరఖాస్తులను రద్దు చేశామని స్పష్టం చేశారు.ఉద్యోగుల సెలవు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గమనిస్తే..ఈ నెల18 నే అధికారిక ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేస్తందా అనే చర్చ మొదలైంది. అంతుకు ముందు రోజే హైపవర్ కమిటీ నివేదిక ప్రభుత్వం తెప్పించుకొనే అవకాశం ఉంది. 18నే పూర్తి చేయానుకుంటే అదే రోజు ఉదయం కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదిక కు ఆమోదం తెలిపి..ఆ వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. లేకుంటే 20న అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ముహూర్తాలను ప్రభుత్వ పెద్దలు నమ్ముతున్న పరిస్థితుల్లో ఈ నెల 29న ముహూర్తం బాగుందని..ఆ రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి..చివరగా అధికారికంగా ఆమోద ప్రక్రియ పూర్తి చేస్తారని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు.హైపవర్ కమిటీ నివేదిక రాగానే...ముందుగా దీని పైన కేబినెట్ సమావేశం ఏర్పాటు కానుంది. ఆ సమావేశంలోనే అసెంబ్లీ నిర్వహణ పైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రాజధాని గ్రామాలతో పాటుగా రాజకీయ పార్టీలు..ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. దీంతో..మరింత సమయం మంచిది కాదనే అభిప్రాయం ప్రభుత్వంలో వ్యక్తం అవుతోంది. నిర్ణయం అమలు చేయాల్సిందేననే అభిప్రాయంతో ఉన్నప్పుడు..మరింత ఆలస్యం చేయటం మంచిది కాదని భావిస్తున్నారు. దీంతో..కమిటీ నివేదిక రాగానే మొత్తం ప్రక్రియ పూర్తి చేయటానికి ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. వచ్చే వారంలో మూడు రాజధానులకు సంబంధించి కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది