రాజధాని గ్రామాల్లో ఎన్నికలు లేనట్లే

రాజధానుల వ్యవహారం పైన రగడ సాగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా కొత్త ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో పంచాయితీ ఎన్నికలు లేకుండా.. పూర్తిగా మన్సిపల్ శాఖ పరిధిలోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా.. అమరావతి పరిధిలోని గ్రామాలకు ఎన్నికలు నిర్వహించద్దంటూ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. అక్కడి కొన్ని గ్రామాలను మంగళగిరి..తాడేపల్లి మన్సిపాల్టీల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మిగిలిన గ్రామాలను కలిపి అమరావతి కార్పోరేషన్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఎన్నికల సంఘం ఆమోదించగానే..వచ్చే కేబినెట్ సమావేశంలో అధికారిక ఆమోద ముద్ర వేయనున్నారు.రాజధాని ప్రాంత గ్రామాల్లో స్థానికసంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపించటం లేదు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు.. అమరావతి నుండి పరిపాలనా వ్యవహారాలు విశాఖ తరలించే విధంగా వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రాంతం రాజధానిగా అయిదేళ్లకు పైగా ఉన్నా..ఇప్పటి వరకు మున్సిపల్ లేదా నగరపాలక సంస్థగా గుర్తింపు రాలేదు. ఇంకా గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. దీంతో..రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే, ప్రభుత్వం నుండి తాజాగా ఎన్నికల సంఘానికి ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది లేఖ రాశారు. అందులో రాజధానిపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయించాలని కోరారు. అమరావతి రైతులు ప్రస్తుతం రాజధాని తరలింపు పైన ఆందోళనతో ఉండటంతో..వారి గ్రామాలకు కార్పోరేషన్ గా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు సైతం సిద్దం చేసినట్లుగా కనిపిస్తోంది. ఇందు కోసం రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించాలని, ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని ప్రతిపాదనలు పంపారు. యర్రబాలెం, బేతపూడి, నవులూరును మంగళగిరి పురపాలికలో కలపాలని, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలని ప్రతిపాదించారు. మిగిలిన గ్రామాలన్నింటినీ కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం గా తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది. అక్కడి నుండి అనుమతి రాగానే రానున్న కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు.ప్రస్తుతం అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజలు ప్రభుత్వ రాజధానుల ప్రతిపాదనల పైనా..ముఖ్యమంత్రి పైనా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రామాలకు కార్పోరేషన్ హోదా ఇవ్వటం ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమరావతిని స్మార్ట్ సిటీగా చేయాలని నిర్ణయించింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ డెవలప్ మెంట్ మీద ప్రతిపాదనలు సిద్దం చేసింది. దీని ద్వారా అటు కేంద్రం ..ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పైన రాజధాని గ్రామాల ప్రజలు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా తాము అమరావతి డెవలప్ మెంట్ కోసం ఏ రకంగా ముందుకెళ్లేదీ చెప్పాలని భావిస్తోంది.