కొత్త ఎండీ కోసం వెతుకుతున్న ముకేశ్‌ అంబానీ!

దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ తమ కంపెనీకి కొత్త ఎండీని నియమించే పనిలో ఉన్నారు. సెబీ నూతన నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త ఎండీ కోసం అన్వేషిస్తున్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఛైర్మన్‌ బాధ్యతలు వేర్వేరుగా ఉండాలని సెబీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో అంబానీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సెబీ నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీలో ఎంతో మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా.. అందులో అంబానీ ముందువరుసలో ఉంటారు.అయితే ఆయన వయసురీత్యా ఎండీగా బాధ్యతలు చేపట్టకూడదని చట్టం చెబుతోంది. అలాగే ఎండీగా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి అంబానీ కుటుంబం నుంచి ఉండబోరు ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ వ్యక్తి వెల్లడించారు.

కొత్త నిబంధనల ప్రకారం.. బోర్డు ఛైర్‌పర్స్‌న్‌గా ఉండే వ్యక్తి ఇకపై నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. స్టాక్‌మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల పాలనను మెరుగు పరచడం సెబీ నూతన మార్గదర్శకాల ఉద్దేశం. ఉదయ్‌ కొటక్‌ సెబీ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ కమిటీ 2017లో తొలిసారిగా ఛైర్మన్‌, ఎండీ వేర్వేరుగా ఉండాలని ప్రతిపాదించింది. 2018లో సెబీ అందుకు ఆమోదం తెలిపింది. మార్కెట్‌లో లిస్టయిన 500 కంపెనీలు రెండేళ్లలోపు ఈ నిబంధనలను అనుసరించాలని పేర్కొంది. అయితే, కంపెనీలకు సెబీ మరికొంత సమయం ఇస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ధీరూభాయ్‌ అంబానీ మరణానంతరం ఛైర్మన్‌గా, ఎండీగా ముకేశ్‌ అంబానీ ఆ బాధ్యతల్లో ఉన్నారు.