జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో సమావేశమయ్యారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశంలో ఉన్న సమయంలో ఢిల్లీ నుండి ఫోన కాల్ రావటంతో పవన్ ఆ వెంటనే ఢిల్లీ వెళ్లారు. రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న పవన్..నాదెండ్ల మనోహర్ ఆరెస్సెస్ నేతలతో సమావేశమయ్యారు. తాజాగా..నడ్డాతో సమావేశం అవ్వటం ద్వారా ఏపీలో కొత్తగా రాజకీయ సమీకరణాలకు తెర లేచింది.

ఏపీలో ఇక బీజేపీ..జనసేన కలిసి నడిచే అవకాశాలు దాదాపు ఖరారైనట్లుగా కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల పైన వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రానున్న రోజుల్లో ఏ విధంగా ముందకెళ్లాలనే అంశాల పైన వారు చర్చలు జరిపినట్లు సమాచారం.
అమరావతి రైతుల ఆందోళన..ప్రభుత్వ ఆలోచనలు..ఏపీ బీజేపీ తాజాగా చేసిన తీర్మానం..తన అభిప్రాయం గురించి పవన్ ఈ భేటీలో వివరించినట్లుగా తెలుస్తోంది.బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జేపీ నడ్డా త్వరలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కొద్ది సేపటి క్రితం నడ్డాతో సమావేశ మయ్యారు. పవన్ తో పాటుగా నాదెండ్ల మనోహర్ సైతం ఉన్నారు. అమరావతి రైతుల అంశం కేంద్రానికి నివేదిస్తానని పవన్ చెబుతూ వచ్చారు.

అయితే, ముందుగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసి ఏపీలో తాజా రాజకీయ పరిణామల గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో బీజేపీ..జనసేన పొత్తు పైన కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయటం వలన నష్టపోయామని పవన్ తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఆయన ఏపీలో పొత్తు పెట్టుకోవటానికి సిద్దంగా ఉన్నారనే సంకేతాలు పార్టీ నేతలకు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

2019 ఎన్నికలు ముగిసిన నాటి నుండి ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షా పైన పవన్ సానుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తానా సభల సమావేశంలో రాం మాధవ్ తో సమావేశం సమయంలో బీజేపీతో స్నేహం గురించి ప్రతిపాదన వచ్చినట్లుగా సమాచారం. అయితే, పవన్ వెంటనే అందుకు అంగీకరించలేదు.

అయితే, ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో పోటీగా ప్రభుత్వం మీద జనసేన పోరాటం చేస్తోంది. టీడీపీతో కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో వెళ్లటం ద్వారా భవిష్యత్ రాజకీయాల్లో మేలు జరుగుతుందనే అంచనాలో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే..ఆయన ఢిల్లీ కి వెళ్లే ముందు జరిగిన పార్టీ సమావేశంలో పొత్తుల గురించి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తుకు సానుకూలంగా స్పందించినా..పవన్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు

ఇక, రాష్ట్ర సమస్యలను కేంద్రానికి నివేదిస్తానని చెప్పి పవన్..ఇప్పుడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలవటం ద్వారా రాజకీయ భేటీ అనేది స్పష్టమవుతోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని..అమిత్ షా ఢిల్లీ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నారు. దీంతో..ముందుగా నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో వారిద్దరి మధ్య ఏపీలో పరిణామాల మీద కీలక చర్చ జరిగినట్లు సమాచారం. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో..రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరితే ఈ ఎన్నికల నుండే వారు పొత్తుతో ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. నడ్డాతో సమావేశం ముగిసిన వెంటనే పవన్ తిరిగి ఏపీకి పయనమయ్యారు.