భోగి మంటల్లో జీఎన్‌రావు నివేదిక..

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైతే.. మరోవైపు అమరావతి ప్రాంతంలో మాత్రం నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని.. ఓ ప్రైవేట్‌ స్థలంలో జేఏసీ ఆధ్వర్యంలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. ఆంధ్రులంతా ఒక్కేటే.. రాజధాని అమరావతి ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఇలా బాధతో సంక్రాంతి జరుపుకోవాల్సి వస్తుందని అనుకోలేదని.. దీనికి అమరావతి సంక్రాంతిగా నామకరణం చేసి జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఎందుకొచ్చాయో.. 5కోట్ల మంది ప్రజలు ఆలోచించాలని.. అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలన్నారు. పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే నిర్మించుకున్నామని.. జీఎన్‌రావు కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి పీడ వదిలించుకున్నామన్నారు. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని.. ప్రభుత్వం రాజీనామా చేసి ఎన్నికలకు మళ్లీ వెళ్లాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రజలు మళ్లీ వైసీపీని గెలిపిస్తే.. నేను రాజకీయాలనుంచి తప్పుకుంటాన్నారు. వైసీపీ తప్ప అందరూ రాజధానిగా అమరావతి ఉండాలనుకుంటున్నారన్నారు.