సీఎంగా ప్రమాణం చేసిన జిల్లాకే వెన్నుపోటు

ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ. అమరావతి రైతులకు మద్దతుగా ఆయన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాధా.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లాకే జగన్ వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు. మనసున్న మారాజని 151 సీట్లు ఇస్తే, ఆయనకు మాత్రం ప్రజల గోడు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. 33 వేల ఎకరాల రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు, వారి పండగకు ఇచ్చే గిప్ట్ రోడ్లు ఎక్కేలా చెయ్యడమా అని ప్రశ్నించారు. రైతుల్ని కొందరు పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటున్నారని, వారిని అమరావతి పంపిస్తే..అసలు ఆర్టిస్ట్‌లు ఎవరో తెలిపోతుందన్నారు.సీఎం జగన్‌కు..పక్క రాష్ట్రానికి వెళ్లడానికి, ఎడ్ల పందేలు తిలకించడానికి సమయం ఉంది కానీ, రైతుల గురించి మాట్లాడేందుకు మాత్రం సమయం లేదా అని విమర్శలు సంధించారు. అమరావతి ప్రాంతంలో కుల, మత, పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం జరగుతోందని, దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. వైసీపీ వాళ్లు 3 రాజధానులు కాకపోతే, 30 రాజధానులు అనుకున్నా, తమకు మాత్రం అమరావతే రాజధాని అని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రైతులు త్యాగాలను ప్రశంసించిన రాధా, వారి ఉద్యమానికి మద్దతుగా ఉంటానని హామి ఇచ్చారు.చాలా రోజుల తర్వాత ప్రజలతో కనిపించారు వంగవీటి రాధా. 2019 ఎన్నికలకు ముందు సీటు విషయంలో వైసీపీతో విభేదించి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం అనంతరం అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కలవడం చర్చనీయాంశమైంది. తాజాగా లోకేశ్‌తో కలిసి చంద్రబాబును కలిసిన రాధా, అధినేత సూచనల మేరకు రైతుల నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.