CAA పై జనసేనాని స్పందన.

ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై

పవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవలే శ్యాంప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన వైట్ పేపర్ ప్రకటనను తాను చదివినట్టు చెప్పారు. ఒకప్పుడు అఖండ భారత్‌గా ఉన్న దేశం.. భారత్-పాక్‌లుగా విడిపోయినప్పుడు.. పాకిస్తాన్ మతప్రాతిపదికన ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఏర్పడిందన్నారు. కానీ భారత్ మాత్రం అందరూ బాగుండాలనే ఉద్దేశంతో సెక్యులర్ విధానాన్ని అవలంభించిందన్నారు.

అదే సమయంలో నెహ్రూ-లియాఖత్ ఒప్పందం గురించి ప్రస్తావించారు.ఆ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లోని మైనారిటీలకు రక్షణ కల్పించాలన్న నిబంధన ఉందని గుర్తుచేశారు. అయితే ఆ నిబంధనను భారత్ పాటించింది కానీ పాకిస్తాన్ మాత్రం పట్టించుకోలేదన్నారు. అందుకే గాంధీ చెప్పినట్టుగా అక్కడ అణచివేతకు గురై.. దేశానికి వలసొచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో నెహ్రూ-లియాకత్ ఒప్పందంపై చర్చ జరుగుతోంది. అసలేంటీ ఒప్పందం..? సీఏఏని సమర్థించేందుకు దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు?

ఏంటీ ఒప్పందం
నెహ్రూ-లియాకత్ ఒప్పందం :

భారత తొలి ప్రధాని నెహ్రూ,పాకిస్తాన్ తొలి ప్రధాని లియాకత్‌ల మధ్య ఏప్రిల్ 8,1950లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ఇది. న్యూఢిల్లీ వేదికగా ఆరు రోజుల పాటు జరిగిన చర్చల సారాన్ని ఇందులో పొందుపరిచారు. దీని ప్రకారం ఇరు దేశాల్లోని మైనారిటీలకు మతాలతో సంబంధం లేకుండా సమాన హక్కులు కల్పించాలి. రెండు దేశాల్లోనూ మైనారిటీ కమీషన్లు ఏర్పాటు చేయాలి.

అమిత్ షా ఏమంటున్నారు..?:
అమిత్ షా వాదన

నెహ్రూ-లియాకత్ ఒప్పందం ప్రకారం భారత్‌లో మైనారిటీలు హక్కులు రక్షించబడ్డాయి కానీ పాకిస్తాన్‌లో మైనారిటీలపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని అమిత్ షా అంటున్నారు. ఒకరకంగా పాకిస్తాన్‌లో హిందువులు,ఇతర మైనారిటీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించబడుతున్నారని అన్నారు. భారత్‌లో రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,చీఫ్ జస్టిస్,ఈసీ చీఫ్.. ఇలా రాజ్యాంగబద్ద పదవుల్లో మైనారిటీలకు అవకాశం దక్కిందని, మరి పాకిస్తాన్‌,బంగ్లాదేశ్‌లలో అలా జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు.భారత్‌లో మైనారిటీలు గౌరవప్రదంగా బతుకుతుంటే.. పొరుగు దేశాల్లోని మైనారిటీలపై మాత్రం వివక్ష,దాడులు కొనసాగుతున్నాయని ఇటీవల మోదీ పేర్కొన్నారు. 1947లో పాకిస్తాన్‌లో మైనారిటీల సంఖ్య 23శాతం ఉంటే, 2011 నాటికి అది 3.7శాతానికి పడిపోయిందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో 1947లో మైనారిటీల సంఖ్య 22శాతం ఉండగా.. ఇప్పుడది 7.8శాతానికి పడిపోయిందన్నారు. అదే సమయంలో భారత్‌లో 1951లో 84శాతం హిందువులు ఉంటే, ఇప్పుడది 79శాతానికి పడిపోయిందన్నారు. అదే సమయంలో 1951లో భారత్‌లో ముస్లింల సంఖ్య 9.8శాతం ఉంటే.. ఇప్పుడది 14.23శాతానికి చేరిందన్నారు. పొరుగుదేశాల్లో మెజారిటీ జనాభా పెరిగి మైనారిటీల సంఖ్య తగ్గుతుంటే భారత్‌లో మాత్రం మైనారిటీ జనాభా పెరిగి మెజారిటీ జనాభా తగ్గుతోందని ఈ లెక్కల ద్వారా అమిత్ షా వివరించారు. అయితే అమిత్ షా చెప్పిన ఈ లెక్కలపై భిన్నాభిప్రాయాలు కూడా వినిపించాయి.సీఏఏలో హిందువులు,క్రైస్తవులు,పార్శీ,సిక్కు,బౌద్దులకు అవకాశం కల్పించి ముస్లింలను మాత్రం మినహాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరికీ ఎలాంటి

భయాందోళనలు అసవరం లేదని.. నెహ్రూ-లియాకత్ ఒప్పందాన్ని తాము అమలుచేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. తద్వారా మైనారిటీ హక్కులకు భంగం వాటిల్లదని చెబుతున్నారు.సీఏఏ అమలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిందని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆ చట్టాన్ని సమర్థించుకోవడానికి అమిత్ షా నెహ్రూ-లియాకత్ ఒప్పందం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు.
ఏదేమైనా సీఏఏ అమలు విషయంలో వెనక్కి తగ్గే ప్రస్తావనే లేదని అమిత్ షా తేల్చి చెప్పేశారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా 11మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులంతా ఏకం కావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖలు రాసిన నేపథ్యంలో హోంమంత్రి నుంచి ఇలాంటి కామెంట్స్ వినిపించడం చర్చనీయాంశంగా మారింది.సీఏఏ చట్టం ముస్లింల పౌరసత్వాన్ని లాగేసుకునే చట్టం కాదన్నారు పవన్ కల్యాణ్. పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించడమే దీని ఉద్దేశం అని చెప్పారు. ఒకప్పుడు గాంధీ ఏం చెప్పారో.. నెహ్రూ ఏం మాటిచ్చారో.. ఇప్పుడు బీజేపీ అదే చేస్తోందని చెప్పారు. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రి ఒక దళితుడు అని, కానీ రెండేళ్లకే ఆయన భారత్ వలసొచ్చాడని తెలిపారు. అక్కడి పరిస్థితులను చూసి తల్లడిల్లిపోయాడని చెప్పారు. హిందువులపై పాక్‌లో జరిగిన దారుణమైన ఊచకోతకు ఆయన ప్రత్యక్ష సాక్షి అన్నారు. అలా అణచివేతకు గురై.. భారత్ వచ్చినవారికి పౌరసత్వం కల్పించడానికే సీఏఏ అన్నారు. ముస్లింలు అక్కడ వివక్షకు గురయ్యే అవకాశం లేదు కాబట్టి.. సీఏఏలో వారికి అవకాశం కల్పించలేదన్నారు.