రాజధానిని తరలిస్తే సీఆర్డీయే పరిస్థితేంటి

ప్రభుత్వం నియమించిన కమిటీలు ఇప్పటివరకు ఇచ్చిన నివేదికలు, ప్రభుత్వ పెద్దల నుంచి వినిపిస్తున్న అభిప్రాయాల ప్రకారం.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు దాదాపుగా ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే అమరావతిని అసలేం చేయబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. అమరావతిని కేవలం లెజిస్లేచర్ కేపిటల్‌కు పరిమితం చేస్తే.. అభివృద్ది ఎలా జరుగుతుందని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను విశాఖకు తరలిస్తే.. కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)ని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఇక తమ ప్రాంతాన్ని ఎలా అభివృద్ది చేస్తారని అక్కడి రైతులు ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రశ్నలన్నింటికి ప్రభుత్వం సిద్దంగానే ఉన్నట్టు తెలుస్తోంది.మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆలోచన చేసినప్పటి నుంచే అమరావతికి ఏమేమి చేయాలన్న దానిపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు సీఆర్డీఏని రద్దు చేసి.. దాని స్థానంలో వుడాను మళ్లీ తెర పైకి తెచ్చే అవకాశం ఉంది. అంటే, విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి ప్రాంతాలను కలుపుతూ గ్రేటర్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తుళ్లూరు మండలంలో 20 గ్రామాలు, తాడేపల్లి మండలంలో 2, మంగళగిరి మండలంలో 9 గ్రామాలను కార్పొరేషన్‌లో కలిపే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను ఇక్కడి నుంచి తరలించినా.. గ్రేటర్ కార్పోరేషన్ ఏర్పాటు ద్వారా అభివృద్ది జరుగుతుందని ప్రభుత్వం వారికి నచ్చజెప్పే అవకాశం ఉంది. ఇక ఎల్పీస్ నిబంధనల ప్రకారం ఐదేళ్ల కాలానికి కౌలు కూడా చెల్లించే అవకాశం ఉంది. దీంతో పాటు రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ది,భూమి లేని పేదలు,వ్యవసాయ కార్మికులకు మరో ఐదేళ్లు పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.