రాజ్యాంగంలో ఆ పదం లేదు ...

ఏపీ శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో కేపిటల్ అన్న పదం లేదని, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచి పరిపాలన జరుగుతుందన్నారు. గతంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఊటీ నుంచి ప్రభుత్వాన్ని పరిపాలించారని జగన్ గుర్తుచేశారు.


ఇందుకు ఏ బిల్లు, ఏ చట్టం అవసరం లేదని, ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఎక్కడి నుంచైనా పరిపాలించొచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే శాసనమండలిని కొనసాగించాలా వద్దా అన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు ఏపీ సీఎం .

కేవలం సూచనల కోసమే మండలిని ఏర్పాటు చేసుకున్నామని, అయితే ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడి నుంచైనా చట్టాలు చేయొచ్చునని జగన్ తెలిపారు.
22 రాష్ట్రాల్లో మండళ్లు లేవని.. కానీ ఏపీలో మండలి కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. పేద రాష్ట్రమైన మనకు మండలి అవసరమా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, చట్టంతో, రూల్స్‌తో సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి అవసరమా అని సీఎం ప్రశ్నించారు. మన అసెంబ్లీలోనే పలువురు మేధావులు ఉన్నారన్నారు.

ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్న మండలిని కొనసాగించాలో లేదో ఆలోచించాలని సీఎం సూచించారు. మన అసెంబ్లీలోనే పి హెచ్డీలు, డాక్టర్స్, ఇంజనీర్లు, ప్రొఫెసర్, రైతులు టీచర్స్ జర్నలిస్టులు ఉన్న సభ అన్నారు.

మండలి చట్టసభలో భాగం కాబట్టి.. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని కానీ ఐదు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ తంతు నడిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 మంది ఎమ్మెల్యేలతో 86 శాతం మందితో అసెంబ్లీ ఏర్పాటైందన్నారు సీఎం .

ఇది ప్రజల సభని, ప్రజలు ఆమోదించిన సభని.. ఈ సభ చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభన్నారు. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పాటైన సభన్నారు. గత ఏడున్నర నెలలుగా ఎన్నో కీలక చట్టాలను ఈ సభలో చేశామని.. భారతదేశ చరిత్రలోనే కనివీని ఎరుగని స్థాయిలో ప్రజలు మాకు అధికారాన్ని అందించారని సీఎం తెలిపారు.

తాము పాలకులం కాదని, సేవకులమని తొలి రోజు నుంచే చెప్పుకుంటూ వస్తున్నామని.. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నామని జగన్ స్పస్టం చేశారు. బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలు తన మనసును ఎంతగానో బాధించాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.