మండలి రద్దుపై ఛైర్మన్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లో ఉన్న వ్యక్తి శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్. అంతకుముందు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ కొనసాగుతున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు, ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షునిగా పనిచేశారు.అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి ఛైర్మన్ హోదాలో సెలెక్ట్ కమిటీకి పంపించినది ఆయనే. ఛైర్మన్‌గా తనకు సంక్రమించిన విచక్షణాధికారాలను వినియోగిస్తూ ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిచినట్లు ప్రకటించారు. దాని పరిణామాలు ప్రస్తుతం ఎక్కడికి దారి తీశాయనేది మనకు తెలిసిన విషయమే. ఏకంగా శాసన మండలినే రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడానికి పురిగొల్పింది.వికేంద్రకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించిన తరువాత తొలిసారిగా షరీఫ్ నోరు విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తనను కలిసిన విలేకరులతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకీ పంపించడం, మంత్రులు దుర్భాషలాడారంటూ వచ్చిన వార్తలు, మూడు రాజధానుల ఏర్పాటు, మండలిని రద్దు చేస్తారంటూ వెల్లువెత్తుతోన్న కథనాలపైనా షరీఫ్ స్పందించారువికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన ప్రక్రియ కొంత మధ్యలోనే మిగలిపోయిందని, దాన్ని పూర్తి చేయాల్సి ఉందని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆ ఉద్దేశంతోనే తాను సెలెక్ట్ కమిటీకి పంపించాల్సి వచ్చిందని అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపించడానికి తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రక్రియ.. నిబంధనలకు లోబడి లేదని, అందుకే దాన్ని తన విచక్షణాధికారాలను వినియోగించాల్సి వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఛైర్మన్ స్థానం నుంచే వెల్లడించారు.మంత్రులు దుర్భాషలాడారంటూ వచ్చిన వార్తలపై షరీఫ్ స్పందించారు. మంత్రులు ఆవేశంలో దుర్భాషలాడి ఉండొచ్చని అన్నారు. ఆవేశంలో చాలా అంటుంటారని.. వాటిని పట్టించుకోవాల్సి అవసరం లేదని కొట్టి పారేశారు. తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదనీ షరీఫ్ స్పష్టం చేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా కొమ్ము కాయాల్సిన అవసరం తనకు లేదని, నిబంధనల ప్రకారమే తన విధులను నిర్వర్తించానని అన్నారు.మూడు రాజధానులను అంశంపై ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. మూడు రాజధానులు ఉండాలా? వద్దా? అనే విషయంపై తాను ఇదివరకు ఎప్పుడూ మాట్లాడలేదని, ఇప్పుడూ కామెంట్ చేయదలచుకోలేదనని అన్నారు. ఛైర్మన్ హోదాలో తటస్థంగా ఉన్న వ్యక్తిని అయినందున దాని గురించి మాట్లాడలేనని అన్నారు. శాసన మండలిని రద్దు చేస్తారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.. అది వారి ఇష్టం అని చెప్పారు.