పోరాటంలో అహింస ను వీడొద్దని రాష్ట్రపతి పిలుపు

ఒక లక్ష్యం పోరాటం చేస్తున్న సమయంలో ప్రజలు, ముఖ్యంగా యువతి అహింసా అనే మార్గాన్ని వీడవద్దని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. వివిధ అంశాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రామ్ నాథ్ కోవింద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

జాతిపిత మహాత్మాగాంధీ అహింస అనే కానుకను మానవాళికి అందించారని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. మనిషి చేస్తున్నది తప్పా? ఒప్పా? అనేదానిపైనే దేశ ప్రజాస్వామ్య పనితీరు ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. పాలన, శాసన, న్యాయ వ్యవస్థ ఆధునిక భారత లక్షణాలని, ఇవి పరస్పర ఆధారితంగా ఉంటాయని స్పష్టం చేశారు.

గాంధీజీ ప్రవచించిన సత్యం, అహింస సూత్రాలు నిత్య జీవితంలో భాగం కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కోట్లాది మంది ప్రజలకు మేలు చేస్తున్నాయని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు.

ప్రజాస్వామ్య పౌరులుగా మనకు రాజ్యాంగం కొన్ని అధికారాలను అందించింది. అదే సమయంలో న్యాయం, స్వాతంత్ర్యం, సోదరభావంతో కూడిన ప్రజాస్వామ్య ఆదర్శాలను పాటించాలని కూడా రాజ్యాంగంలో ఉంది. దేశ నిరంతర అభివృద్ధి, పరస్పర సోదర భావం కోసం ఇదే ఉత్తమ మార్గం. జాతిపిత మహాత్మాగాంధీ మార్గంలో వెళ్లడం వల్ల ఈ ప్రజాస్వామ్య ఆదర్శాలను పాటించడం మరింత సులభమవుతుందని రాష్ట్రపతి కోవింద్ వివరించారు.

గణతంత్ర రాజ్యాన్ని నడిపించేది ప్రజలేనని.. వారి సంఘటిత శక్తి దేశ నిజమైన సత్తాను చాటుతుందని రాష్ట్రపతి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ప్రజలు దేశ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.