కోర్టుకెళ్లడానికి 30 కోట్లు మండలికి 60 కోట్లు పెట్టలేవా

మండలి రద్దు తీర్మానం విచారకరమన్నారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన అనంతరం బాబు మీడియాతో మాట్లాడారు.


సీఎం జగన్ నిర్ణయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని.. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారనే ఆగ్రహంతోనే మండలిని రద్దు చేసే నిర్ణయం తీసుకున్నారని బాబు మండిపడ్డారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యే 86 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 57 శాతం నేరచరిత్ర ఉన్నవాళ్లేనని టీడీపీ అధినేత గుర్తుచేశారు.

ఈ నేరస్థుల ముఠాను ముఖ్యమంత్రి.. మేధావులు అంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఒకే రోజు కేబినెట్, అసెంబ్లీ పెట్టి బిల్లులను ఆమోదిస్తున్నారని... మండలిలో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పేంటని బాబు నిలదీశారు.

మండలికి జగన్ ప్రభుత్వం రాజకీయాలు ఆపాదిస్తోందని.. మండలి కావాలని పది రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయని టీడీపీ చీఫ్ గుర్తుచేశారు. ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా మండలి పనిచేస్తోందని జగన్ అంటున్నారన్నారు.

సీఎం జగన్ కోర్టుకు వెళ్లడానికి సెక్యూరిటీ ఖర్చుల కింద ఏడాదికి రూ.30 కోట్లు ఖర్చవుతోందని.. శాసనమండలికి ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు చేస్తే తప్పంటని చంద్రబాబు ప్రశ్నించారు.

మండలి నిర్వహణకు ఏడాదికి కోట్లు ఖర్చు పెడుతున్నారని జగన్ గగ్గోలు పెడుతున్నారని టీడీపీ అధినేత మండిపడ్డారు. కౌన్సిల్ పెట్టాలని టీడీపీ ఎప్పుడూ నిర్ణయించలేదని.. పార్టీలో చర్చ జరిగిన తర్వాత కౌన్సిల్‌ను కొనసాగించాలని నిర్ణయించామని చంద్రబాబు గుర్తుచేశారు.

తీర్మానంపై ఓటింగ్ పేరుతో ఆయన అసెంబ్లీలో డ్రామాలాడారని.. తీర్మానానికి 121 మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారని స్పీకర్ ముందు చెప్పారని, ఆ తర్వాత 133 మంది అనుకూలంగా ఓటు వేసినట్లు ప్రకటించారని ప్రతిపక్షనేత తెలిపారు.

ఉన్నత ఆశయాలతో ఏర్పడిన మండలిని రద్దు చేయడం సరికాదని, రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారని చంద్రబాబు పేర్కొన్నారు. మారిన పరిస్ధితులకు అనుగుణంగా సిద్ధాంతాలను మార్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న బాబు.. మండలిలో బిల్లులకు ఎక్కడా టీడీపీ అడ్డుపడలేదన్నారు.