ఏపీలో కొత్తగా 3 జిల్లాలు మంత్రివర్గం ఆమోదం

ఏపీలో మండలి రద్దు నిర్ణయానికి ఆమోద ముద్ర వేసిన సమయంలోనే ఏపి కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వస్తే ఏపీలోని మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా మారుస్తామ ని అప్పట్లోనే జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు ఏర్పాటు అవుతాయని చెప్పారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో కసరత్తు సైతం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నిక లు పూర్తయిన తరువాత..కొత్త జిల్లాల ఏర్పాటు పైన ముందుకెళ్లాలని ప్రభుత్వం భావించింది.

అదే సమయంలో మూడు రాజధానల ప్రతిపాదన తెర మీదకు రావటంతో..అది సైతం ప్రస్తుతం పక్కన పెట్టారు. ఇక, సుప్రీం కోర్టులో స్థానిక సంస్థల రిజర్వేషన్ల కారణంగా ఎన్నికల పైన స్టే విధించారు.ఇక, ఇప్పుడు తాజాగా ఏపీ మంత్రివర్గం అనూహ్యంగా ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారిక ప్రకటన రాకపోయినా.. మూడు జిల్లాల దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలు స్తోంది. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మూడు ప్రాంతాల్లో వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలంటే రూ.500- రూ.600 కోట్ల వరకూ వ్యయమవుతుంది.

అక్షరాస్యత, వైద్య వసతులు తక్కువగా ఉండి, అసలు ఎలాంటి వైద్య కళాశాలలు లేని బాగా వెనుకబడి ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే... అందుకయ్యే వ్యయంలో 60శాతం వరకూ భారత వైద్య మండలి సమకూర్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే తొలి దశలో పైన పేర్కొన్న 3 ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రస్తుతం వైద్య కళాశాలకు సాయం కోసం మూడు జిల్లాల ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మూడు జిల్లాలు సైతం కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న 12 జిల్లాల్లో భాగంగానే కనిపిస్తోంది. భవిష్యత్ నిర్ణయాలకు అనుగుణంగానే ఈ మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తే..అందులో గుంటూరు జిల్లా నర్సరావు పేట కొత్త జిల్లా కానుంది. దీంతో..ఇప్పుడు ఏర్పాటు చేయనున్న గురజాల అదే పార్లమెంట్ పరిధిలో ఉండటంతో కొత్త జిల్లాగా కొనసాగే అవకాశం ఉంది.

ఇక, క్రిష్టా జిల్లా మచిలీ పట్నం..అరుకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ప్రతిపాదనలో ఉన్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఈ రెండు జిల్లాలు సైతం భవిష్యత్ లో ఏర్పాటు చేసే 12 జిల్లాల్లో భాగంగా ముందుగానే ఏర్పడనున్నాయి. దీని ద్వారా..ప్రభుత్వం మరో తొమ్మది జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ జిల్లాల అధికార ఏర్పాటుకు ముందు భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.