మారుతున్న ఢిల్లీ రాజకీయం

దేశరాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నాయి. మినీ ఇండియాగా ఉన్న హస్తిన ఓటర్ల చూపు ఏ పార్టీ వైపు? ఎవరు ఢిల్లీ విజేతగా నిలిచేది.? ఢిల్లీ ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ ఎలా వుంది? ఇప్పుడు ఈ అంశాలు దేశం నలుమూలలా చర్చనీయాంశాలుగా మారాయి.

70 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్న కేంద్ర పాలిత రాష్ట్రం ఢిల్లీ. రాష్ట్రం చిన్నదే అయినా, అసెంబ్లీ సీట్లు తక్కువగానే ఉన్నా.. దేశరాజకీయాలను ప్రభావితం చేయడంలో మాత్రం హస్తిన నగరం తక్కువేం కాదు. దేశ రాజధాని కావడం, అందులో అన్ని వర్గాల, రాష్ట్రాల ప్రజలు నివసిస్తుండటమే ఇందుకు కారణం.ఈ సారి జరిగే ఎన్నికల్లో సుమారు ఒక కోటిన్నర మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కేవలం నెలల వ్యవధిలోనే ఢిల్లీ ఓటర్లు పూర్తి భిన్నమైన తీర్పును ఇస్తారనడానికి గతంలో జరిగిన ఎన్నికలే నిదర్శనం. 2013 ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ 28 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని 48 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత చేతులెత్తేసింది. అనంతరం 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏడు పార్లమెంట్ స్థానాలకు ఏడు సీట్లను గెలుచుకొని సత్తా చాటింది. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 67 స్థానాలను కైవసం చేసుకొని భారీ విజయాన్ని నమోదు చేశారు. ఇదే ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 స్థానాలు గెలుపొందగా.. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు.ఇక ఈ సారి జరిగే ఎన్నికలు ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ప్రధాన పోరుగా ఆయా పార్టీలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతను సొంతం చేసుకొని హస్తిన అసెంబ్లీలో పునర్ వైభవం సాధిస్తామని హస్తం పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఢిల్లీలోని ఏడు స్థానాలను గెలుపొందింది. 50 శాతానికిపైగా ఓట్లను సొంతం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖులు కూడా ఓటమిపాలయ్యారు. అంతే కాదు ఐదు చోట్ల ఆ పార్టీ మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు.అయితే 2015 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఏర్పడ్డాయి. అప్పటి మ్యాజిక్‌ను కేజ్రీ ఇప్పుడు కూడా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది..

మరోసారి హస్తిన అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ఎన్నికల ఫలితలనే పునరావృతం చేస్తూ తిరుగులేని విధంగా జెండా ఎగురవేయాలని వ్యూహాలను సిద్ధం చేసింది చీపురు పార్టీ. ప్రధానంగా గత ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కేజ్రీవాల్. అటూ ఎన్నికల స్ట్రాటెజిస్ట్ గా పేరుమోసిన ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో జతకట్టారు. మరోమారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు ప్రశాంత్ కిషోర్‌కు చెందిన సంస్థ ఐపాక్‌తో కేజ్రీవాల్ ఒప్పందం చేసుకున్నారు.

ఇక 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేజ్రీవాల్ వ్యూహం మార్చారు. ముఖ్యంగా.. ప్రధాని మోదీతో నేరుగా తలపడటాన్ని మానుకున్నారు. ఢిల్లీ ఎన్నికలు కేజ్రీవాల్ వర్సెస్ మోదీ అనే పరిస్థితి రాకుండా ఉండటం కోసం ఆయన స్థానిక సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేశారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఢిల్లీ ఓటర్లపై ప్రజాకర్షక పథకాల జల్లు కురిపించారు. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే వారికి ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను అమలు చేశారు.

10 ముఖ్యమైన హామీలతో కేజ్రీవాల్ గ్యారెంటీ కార్డును ప్రవేశ పెట్టారు. రాజధాని నగరానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్, స్వచ్ఛమైన నీరు అందిస్తామంటూ కీలక హామీలను ఈ గ్యారెంటీ కార్డులో పొందుపరిచారు. మహిళా భద్రత, నీటి సరఫరా, యుమునా నది ప్రక్షాళన, రవాణారంగాన్ని మెరుగుపరచడం వంటి పలు అంశాలపై ప్రజలకుమరోసారి భరోసా ఇవ్వడం జరిగిందని ఆప్ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్‌కు ప్రభుత్వ పని తీరును వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పౌరసత్వ చట్ట సవరణ అంశంలో కేజ్రీవాల్ మౌనం మిగతా పార్టీలకు కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు..