అమ్మఒడి లబ్ధిదారుల తొలి లిస్ట్ రెడీ

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల తొలి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 41 లక్షల 46 వేల 884 మందిని గుర్తించిన సర్కార్.. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మరికొంతమందితో కలిపి తుది జాబితాను జనవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి జాబితాను ఇవాళ, రేపు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉంచనున్నారు. కాగా, ఈ పథకాన్ని సీఎం జగన్ జనవరి 9న ప్రారంభిస్తారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేలు జమ చేయనుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6,455 కోట్లు కేటాయించారు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు అమ్మ ఒడి పథకానికి అర్హులు, అంతేకాక విద్యార్థులకు స్కూళ్లలో కనీసం 75% హాజరు ఉండాలి.