వైఎస్ జగన్ పై నిందలు వేసిన పవన్ కల్యాణ్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రతిపాదించిన బడ్జెట్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు వేశారు. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిందించడం గమనార్హం. ఏపీకి నిధులు రాబట్టడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. రాజధాని తరలింపు, కూల్చివేతలపై పెట్టిన శ్రద్ధ బడ్జెట్ కేటాయింపులపై పెడితే బాగుండేదని ఆయన అన్నారు. వైసీపీ ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన అన్నారు.బలమైన ఆర్థిక ప్రగతిని సాధించే దిశగా బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు అండగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని ఆయన అన్నారు. రైతులకు, యువతకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు.

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ పార్లమెంటు సభ్యులు విమర్శలు చేసిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో మొండిచేయి చూపించారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలావుంటే, సీఎం జగన్ నిర్వాకం వల్లనే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపించారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు 22 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని జగన్ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ మెడ సగం వంగిపోయిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రం కోసం ఇచ్చిన వినతుల కన్నా కోర్టు వాయిదాలు ఎగగొట్టేందుకే ఎక్కువ లేఖలు రాశారని ఆయన జగన్ ను విమర్శించారు. రాజధానిపై ఐదు దేశాల ఎంబసీ హెచ్చరించాయని, తుగ్లక్ చర్యలతో దేశవిదేశాల్లో నవ్వుల పాలయ్యామని ఆయన అన్నారు.