ENGLISH,TELUGU NEWS

EIGHT NEWS పాఠకులు కు వినాయక చవతి శుభాకాంక్షలు


శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము.


ఈసారి వినాయక చవితి రోజు(ఆగస్టు 25)న చవితి రాత్రి 9.20 వరకు ఉన్నది. కాబట్టి ఇంటిలో పూజ చేసుకునేవారికి మధ్యాహ్నం 12లోపు పూజించాలి. విధుల్లో మంటపాన్ని పెట్టి ఆవాహన చేసేవాళ్ళు సాయంత్రం లోపు చేయాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే | మన పండుగలు మన భారతీయ సంస్కృతికి అద్దంపడుతూ! అవి ఆణిముత్యాలతో గూడిన ముత్యాలహారంలా ప్రకాశిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబింప చేస్తుఉంటాయి. అటువంటి పండుగలలో విశిష్టమైనది

"వినాయకచవితి'.శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము.వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడని సాధారణ ప్రవచనం. కాని ఇతని జన్మ గురించి పురాణాలలో గాథా భేదాలున్నాయి.ఇతనిని శివుడు సృష్టించాడని ,ఇతనికి తన వంటి నలుగుతో పార్వతి ప్రాణం పోసిందని, పుణ్యక వ్రతం ఆచరించి పార్వతీదేవి ఈ బిడ్డను కన్నదని, పార్వతీ పరమేశ్వరులు వినాయకుని సృష్టించారని,స్వయంభువువైన ఇతనిని పార్వతీపరమేశ్వరులు కనుగొన్నారని ఇలా అనేక గాథలున్నాయి.

శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము.శ్రీ వరసిద్ధి వినాయకవ్రతమునకు కావలసిన వస్తువులు:


1.పసుపు 25 గ్రా.
2.కుంకుమ 25 గ్రా.
3.పసుపు గణపతి
4.పార్ఠివగణపతి(మట్టితో చేసిన గణపతి)
5.పాలవెల్లి(అలంకారముతొ)
6.బియ్యం అరకిలొ
7.తమలపాకులు 20
8.అగరవత్తులు 1 ప్యాకట్
9.ప్రత్తి
(ఒత్తులకు,వస్త్రయుగ్మమునకు, యజ్ణోపవీతమునకు)
10.దీపము(ఆవునేతితొగాని, కొబ్బరి నూనెతొగాని)
11.పంచామృతములు(ఆవుపాలు, పెరుగు,నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు, అరపళ్ళు, బెల్లం 100 గ్రా, కొబ్బరికాయ హారతి కర్పూరం

పార్థివ ప్రతిమా ప్రాశస్త్యము:


వినాయకుని ప్రతిమ మట్టిదే వాడవలెనా? ఏ రంగుది వాడవలెను? ఇవి అనేకుల ప్రశ్నలు. దీనికి గణేశ పురాణంలో సమాధానం కలదు.

శ్లో: పార్థివీ పూజితామూర్తి:స్థ్రియావా పురుషేణవా ఏకాదదాతి సా కామ్యం ధన పుత్రి పశూనపి


పురుషుడు గాని, స్త్రీ గాని మట్టితో చేసినగణపతి ప్రతిమను పూజ చేసినచో ధన,పుత్ర, పశ్వాది సమస్త సంపదలను పొందగలరు.

ఆ ప్రతిమ ఎట్టిమతో చేయవలెను?శ్లో. కృత్వా చారుతరాం మూర్తిం గ ణేశస్య శుభాం స్వయం సర్వావయవ సంపూర్ణాం చతుర్భుజ విరాజితాం
నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను స్వయముగ చేసుకొనవలెను. అయితే ఇది అందరికి సాధ్యం కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసి ఇచ్చు అంగళ్ళు వినాయకచవితి ముందురోజునుండే పెడుతున్నారు. అట్టి ప్రతిమ అన్నిటికన్న మంచిదని గణేశ పురాణమును బట్టి గ్రహించవలెను.

దైవ ప్రార్థన:(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను.
శ్లో: 1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే

గణపతి పూజ


ప్రాణ ప్రతిష్ట


(పుష్పముతో పసుపు గణపతిని తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను.
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవింకవీనాం ఉపవశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్నణస్పత ఆనశృణ్వమన్ న్నోతిభి స్సీదసాధనం
అసునీతే పునరస్మాను చక్షు: పున: ప్రాణమినహనోదేహి భోగం
జ్యోక్పశ్యేమసూర్యముచ్చరంతమనుమతే మృళయాద స్స్వస్తి
అమృతంవై
ప్రాణామృతమాప:
ప్రాణానేవయధాస్థానముపహ్వ్యయతే.
శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నిపుత్ర పరివార సమేతం
శ్రీమహాగణాధిపతిం ఆవాహయామిస్థాపయామి పూజయామి స్థిరో భవ, వరదోభవ, సుప్రసన్నోభవ,
స్థిరాసనం కురు. గణపతి ప్రాణప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తో అస్తు.

షోడశోపచార పూజ:


శ్రీ మహాగణాధిపతయే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమ:
అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
గణపతికి నామములు పుష్పములు గాని, అక్షతలు గాని భక్తితో సమర్పింవవలెను (అగరవత్తులు వెలిగించి ధూపమును చూపించవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి.
(దీపమునకు నమస్కరించవలెను.)
దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి.
శ్లో: ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ గణనాయక.

ఉద్వాసన:


మం: యజ్ణేన యజ్ణ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్, తేహనాకం మహిమానస్సచంతే, యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా:
శ్రీ మహాగణాధిపతిం యధాస్థానముద్వాసయామి. శోభనార్ధం పునరాగమనాయచ.
(గణపతిని తమలపాకుతో తీసి పూజామందిరంలో ఈశాన్యభాగంలో ఉంచవలెను.)
(పసుపు గణపతి పూజ సమాప్తం)
హరి: ఓం తత్సత్.

శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము


పాలవెల్లిని పండ్లు, పుష్పములు, మామిడి ఆకులు మొదలగు వాటితో అందముగా అలంకరింవి దేవుని మందిరముపై వ్రేలాడదీసి, ఆ పాలవెల్లి క్రింద కర్ర చెక్కను గాని, పీటను గాని పసుపు పూసి, కుంకుమ, వరిపిండి మొదలగువానితో అలంకరింవిఉంచుదురు. ఆపీటపై ఒక తమలపాకును కొన తూర్పువైపు ఉండునట్లు పెట్టి దానిపై వినాయకప్రతిమను ఉంచవలెను.

సంకల్పము:
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: పుష్పాణి పూజయామి ( వినాయకునికి పుష్పములు సమర్పింపవలెను)

అధాంగపూజ:


(ఇక్కడ వినాయకుని ప్రతి అంగమును పుష్పములచే పూజించవలెను.)
ఓం గణేశాయనమ: పాదౌ పూజయామి.(పాదములు)
ఓం ఏకదంతాయనమ: గుల్ఫౌ పూజయామి. (చీలమండలు)
ఓం శూర్పకర్ణాయనమ: జానునీ పూజయామి. (మోకాళ్ళు)
ఓం విఘ్నరాజాయనమ: జంఘే పూజయామి. (పిక్కలు)
ఓం అఖువాహనాయనమ: ఊరూ పూజయామి. (తొడలు)
ఓం హేరంబాయనమ: కటిం పూజయామి. (మొల)
ఓం లంబోదరాయనమ: ఉదరం పూజయామి. (కడుపు)
ఓం గణనాధాయనమ: నాభిం పూజయామి. (బొడ్డు)
ఓం గణేశాయనమ: హృదయం పూజయామి. (వక్షము)
ఓం స్థూలకంటాయనమ: కంటం పూజయామి.(కంటం)
ఓం స్కందాగ్రజాయనమ: స్కందౌ పూజయామి.(భుజములు)
ఓం పాశహస్తాయనమ: హస్తౌ పూజయామి.(చేతులు)
ఓం గజవక్త్రాయనమ: వక్త్రం పూజయామి.(నోరు)
ఓం విఘ్నహంత్రేనమ: నేత్రం పూజయామి. (కండ్లు)
ఓం శూర్పకర్ణాయనమ: కర్ణౌ పూజయామి. (చెవులు)
ఓం ఫాలచంద్రాయనమ: లలాటం పూజయామి. (నుదురు)
ఓం సర్వేశ్వరాయనమ: శిర: పూజయామి. (శిరస్సు)
ఓం విఘ్నరాజాయనమ: సర్వాంగాని పూజయామి.

ఏకవింశతి పూజ:


(వినాయకుని 21 రకముల పత్రములచే (ఆకులచే) పూజింపవలెను. ంస్కృతపదము పక్కనే ఆపత్రము యొక్క తెలుగు పేరు కూడ యివ్వడమైనది.
ఇందులో కొన్ని పత్రములు సాధారణంగా పూజకు వాడనివి. కాని వినాయకచవితి రోజున అవి వాడుటకు అనుమతించబడియున్నది.)
ఓం సుముఖాయనమ: మాచీపత్రం సమర్పయామి (మాచి పత్రి)
ఓం గణాధిపాయ నమ: బృహతీ పత్రం సమర్పయామి (వాకుడు)
ఓం ఉమా పుత్రాయ నమ: బిల్వపత్రం సమర్పయామి (మారేడు)
ఓం గజాననాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి (రెండు గరికలు)
ఓం హరసూనవే నమ: దత్తూర పత్రం సమర్పయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమ: బదరీ పత్రం సమర్పయామి (రేగు)
ఓం గుహాగ్రజాయనమ: అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయనమ: తులసీ పత్రం సమర్పయామి (తులసి)
ఓం ఏకదంతాయనమ: చూతపత్రం సమర్పయామి (మామిడి)
ఓం వికటాయనమ: కరవీర పత్రం సమర్పయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయనమ: విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (విష్ణుక్రాంతి)
ఓం వటవే నమ: దాడిమీ పత్రం సమర్పయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమ: దేవదారు పత్రం సమర్పయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమ: మరువక పత్రం సమర్పయామి (మరువం)
ఓం హేరంబాయ నమ: సింధువార పత్రం సమర్పయామి (వావిలి)
ఓంశూర్పకర్ణాయనమ: జాజీపత్రం సమర్పయామి (జాజి)
ఓం సురాగ్రజాయనమ: గండకీ పత్రం సమర్పయామి (ఏనుగుచెవి ఆకు)
ఓం ఇభవక్త్రాయ నమ: శమీ పత్రం సమర్పయామి (జమ్మి)
ఓంవినాయకాయ నమ: అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి)
ఓం సురసేవితాయ నమ: అర్జున పత్రం సమర్పయామి (మద్ది)
ఓం కపిలాయ నమ: అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమ: ఏక వింశతి పత్రాణి పూజయామి

దూర్వాయుగ్మ పూజ:


(21గరికపోచలతో ఈపూజ చేయవలెను. క్రింది పది నామములు చదువుతూ ప్రతి నామమునకు “దూర్వాయుగ్మం” అనగా రెండేసి గరికపోచలు సమర్పించవలెను.)
ఓం గణాధిపాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఉమాపుత్రాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం అఘనాశనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం వినాయకాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఈశపుత్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఏకదంతాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఇభవక్త్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం మూషక వాహనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం కుమారగురవే నమ: దూర్వాయుగ్మం సమర్పయామి

శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకధ:


(అక్షతలు చేతిలో తీసుకొని కధ చదువవలెను.)


శూతుడు అను ఋషి శౌనకాది మునులకు వరసిద్ధివినాయక వ్రతమును గురించి చెప్పెను.
వినాయకుడు అనగా దుష్టులను, విఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్ధము. ఇతడు విద్యాధిదైవతము గాను, వ్రాయుట అను పద్ధతిని ఆరంభించిని దైవము గాను పూజింపబడు చున్నాడు.

విఘ్నేశ్వరుని పుట్టుక:


పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరముకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధింపరాని విధంగా ఉండుటకై పరమశివుని తన ఉదరమునందు నివసించాలని వరము పొందినాడు. అది విన్న పార్వతీదేవి కలతచెంది శ్రీ మహావిష్ణువును ప్రార్ధింపగా,నందీశ్వరుని గంగిరెద్దుగా, తాను గందిరెద్దును ఆడించేవానిగా వేషము ధరించి,గంగిరెద్దును గజాసురుని ఎదుట చిత్రవిచిత్రముగా ఆడించి ఆ అసురుని మెప్పించి, ఆఅసురుని ఉదరకుహరమందున్న పరమశివుని కోరినాడు.
అంత విష్ణుమాయను గ్రహించి,తనకు చేటుకాలము దాపురించిందని తలచి, శివుని ఉద్దేశించి, గజాసురుడు ” ప్రభూ! శ్రీ హరి ప్రభావముచే నాజీవితకాలము ముగియనున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోకములు పూజించునట్లు, నాచర్మమును నిరంతరము నీవు ధరించునట్లు వరము నిమ్మని తన శరీరమును నందీశ్వరునకు వశము చేసి శివునకు తన ఉదరకుహరమునుండి విముక్తిని ప్రసాదించినాడు. చాలాకాలమునకు శివుడు తిరిగి కైలాసమునకు వచ్చుచున్నాడన్న శుభవార్త తెలిసిన పార్వతీదేవి సర్వాలంకారభూషితురాలై భర్తను స్వాగతింపదలచి, అభ్యంగనస్నాన
మాచరించుటకుసిద్ధమై, నలుగుపిండితో ఒక బాలునిబొమ్మను చేసి, దానికి ప్రాణప్రతిష్ట చేసి,లోపలికి ఎవరూ రాకుండా వాకిలి వద్ద కాపలా ఉంచెనుఅంత సంతోషముతో పార్వతి చెంత చేరాలని వస్తున్న పరమేశ్వరుని గాంచిన ఆ బాలుడు అభ్యంతరమందిరమందు నిలువరించగా, పరమేశ్వరుడు ఆగ్రహము పట్టలేక ఆ బాలుని శిరమును ఖండించి మందిరము లోనికి ఏగినాడు. మాటలసందర్భంలో బాలుని ప్రసక్తి రాగా జరిగిన ఘోరముతెలుసుకొన్న పార్వతీదేవిని శివుడు ఓదార్చి, ఉత్తరదిశగా తలపెట్టి నిద్రించుచున్న ప్రాణి తలను తెచ్చి ఆ కుర్రవాని మొండెమునకు అతికింపుమని తన పరివారమునకు ఆదేశించెను. వారు ఉత్తరముగా పరుండిన ఒక ఏనుగు తలను తిచ్చి ఆబాలుని మొండెమునకు
అతికించిరి. అప్పుడు శివుడు ప్ర్రాణప్రతిష్ట చేయగా ఆబాలుడు గజాననుడైనాడు. గజాననుడు తల్లిదండ్రులకు భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక మూషికమును వాహనముగా చేసికొనెను. కొంతకాలమునకు పార్వతిపరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను. అంత మహేశ్వరుడు కుమారులతో “ఇరువురిలో ఎవరు ముల్లోకములందలి
పుణ్యతీర్ధములందు స్నానమాచరించి ముందుగా తనను చేరుదురో వారికి ఆధిపత్యము యిత్తుననెను. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనమునధిరోహించి, వాయువేగమున బయలువెడలెను. గుజ్జురూపమున నున్న గజాననుడు తన మూషకవాహనంపై తండ్రి పెట్టిన పోటి నెగ్గడం అసాధ్యమని గ్రహించి, కాస్త ఆలోచించి, ఈ పోటీ తన గురించి పెట్టినట్లు గ్రహించి, గజాననుడు భక్తితో ముమ్మారు తల్లిదండ్రులకు,ప్రదక్షిణ నమస్కారాలాచరించి ప్రణమిల్లాడు. అక్కడ కుమారస్వామి ఏ తీర్ధమునకు పోయిననూ అన్నగారు తనకన్న ముందు ఉండటం చూసి, ఆశ్చ్రర్యమునొంది, కైలాసమునకు చేరగానే తల్లిదండ్రులకు ప్రణమిల్లుతున్న అన్నగారిని చూసి, జరిగినది తెలుసుకొని, తన అహంకారమును నిందించుకొని, తండ్రితో అన్నయ్యకే గణాధిపత్యమును ఒసంగమనెను.
మహేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి తిధియందు గజాననునకు విఘ్నాధిపత్యమునొసంగెను. ఆ దినమున గజాననుడు సర్వజనులు భక్తిశ్రద్ధలతో చేసినపూజను గ్రహించి, కుడుములు, ఉండ్రాళ్ళు ,పళ్ళు మొదలుగా గల ఎన్నో రకాలు నైవేద్యాలను ఆరగించి, కైలాసమునకేగి, తల్లితండ్రులకు పాదాభివందనం చేయడానికి ఎంతో కష్ట పడుతున్న వినాయకుని చూసి పరమశివుని శిరమునందలి చంద్రుడు వికటముగానవ్వెను. అంత రాజదృష్టి శోకిన రాళ్ళు కూడ నుగ్గవునను సామెత ననుసరించి, విఘ్నేశ్వరుని ఉదరము పగిలి కుడుములచట ఎల్లెడల ద్రొల్లెను. అంత పార్వతీ దేవి శోకించుచు చంద్రుని చూచి, ” పాపాత్మా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను. కావున నిన్ను చూచినవారు నీలాపనిందలు పొందుదురుగాక.” అని శపించెను.
ఆ సమయమును సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమభార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయమున క్షీణించుచుండ అంతస్వాహాదేవి అరుంధతిరూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపములను తానే ధరించి, భర్తకు ప్రియమును కలుగచేసెను. అయితే ఋషులు అగ్ని దేవునితో ఉన్నది తమ భార్యలేనని భావించి, వారిని పరిత్యజించినారు.
పార్వతీదేవి శాపానంతరము చంద్రుని చూచుటవల్లే తమకిట్టి నీలాపనిందలు కలిగెనని గ్రహించి, వారు బ్రహ్మదేవుని కడకేగి, జరిగినది విన్నవించి ప్రార్ధింపగా బ్రహ్మదేవుడు ఋషులతో వారి పత్నుల తప్పు ఏమియు లేదని తెలిపి, వారితో కూడ బ్రహ్మ కైలాసమునకు ఏతెంచి, ఉమామహేశ్వరులను సేవించి, మృతుడై ఉన్న వినాయకుని బ్రతికించెను. అంత దేవాదులు,” పార్వతీ దేవి! నీవిచ్చిన శాపవశమును లోకములకెల్ల కీడు వాటిల్లెను. కావున దానిని ఉపసంహరింపమని ప్ర్రార్ధింప అంత పార్వతీ దేవి , “ఏనాడు వినాయకుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినము చంద్రుని చూడరాదు.” అని శాపావకాశము నొసెంగెను. అంత వారందరు వారి గృహమలకేగి భాద్రపద శుద్ధచవితి నాడు చంద్రుని చూడక జాగరూకతతో సుఖముగా నుండిరి.ఇట్లు కొంత కాలము గడిచెను.
అందువల్ల అతడు గణపతి అయ్యొను. అటులనే విఘ్నములకు కూడా ఆధిపత్యము ఒసగుటవలను విఘ్నేశ్వరుడైనాడు. ఈ ఆధిపత్యములు స్వీకరించిన రోజు,తాను జన్మించినరోజు భాద్రపద శుద్ధ చవితి కనుక ఆరోజు ముల్లోకములలోని వారు వినాయకుని పూజించి తమతమ అభీష్టములు పొందెదరు.
శ్యమంతకోపాఖ్యానము: ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్ముని నారదుడుదర్శించి స్తుతించుచు ప్రియసంభాషణ జరుపుచు, ” స్వామీ! సాయంసమయమాయెను. ఈనాడు విఘ్నేశ్వర చతుర్ధి గాన పార్వతీశాపముచే చంద్రుని చూడరాదు. కాన సెలవివ్వవలసింది.” అని నారదుడు వెడలగానే ద్వారకయందు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదు. అనిచాటింపు వేయించెను. ఆనాటి రాత్రి క్షీరప్రియుడగుటచే శ్రీకృష్ణుడు మింటికి చూడకనే గోష్టమునకు పోయి పాలుపిదుకుచు పాలలో చంద్ర ప్రతిబింబము గాంచి, “ఆహా! నాకిక ఎట్టి ఆపద రానున్నదో” అని సంశయించెను.
వృష్ణి వంశీయుడగు నిమ్నుడను వానికి ప్రసేనుడు, సత్రాజిత్తు అను యిరువురు కొడుకులు ఉండెడివారు. సత్రాజిత్తు సూర్యదేవుని ఆరాధించి,సూర్యుని మెప్పించి,అత్యంత ప్రకాశవంతమైన రోజుకి ఎనిమిది బారువుల బంగారము నిచ్చునట్టి శ్యమంతకమణి అను ఒక దివ్యమైన మణిని వరంగా పొందెను.ఆ మణిని తీసుకుని శ్రీకృష్ణదర్శనార్ధము ద్వారకకు విచ్చేసిన సత్రాజిత్తు ద్వారా మణి మహిమను తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ మణిని ద్వారకను పాలిస్తున్న ఉగ్రసేన మహారాజుకు కానుకగా యిమ్మనెను. సత్రాజిత్తు అందుకు నిరాకరించెను. కొంతకాలమునకు ప్రసేనుడు అశుచిగా ఉండి మణిని ధరించి వేటకు వెడలెను.మహామహిమాన్వితమైన ఆమణిని శుచి కాని వారు ధరించినచో వారికి అపాయము వాటిల్లగలదు. ఒక సింహము అది ఒక మాంసఖండముని భ్రమసి ప్రసేనుని చంపి ఆ మణిని గ్రహింపగా జాంబవంతుడను భల్లూకరాజు సింహమును చంపి మణిని తీసుకొనిపోయి తన కుమార్తె అయిన జాంబవతికి ఆటవస్తువుగా యిచ్చెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మరణవార్త విని, “శ్రీకృష్ణుడు మణినీయనందులకు తనసోదరుని చంపి మణిని అపహరించెను”. అని చాటించెను.
అది విని శ్రీకృష్ణుడు నాడు క్షీరమున చంద్రబింబ దర్శనదోషంబని తలచి దానిని నివారించుకొనుటకు తనపరివారముతో అరణ్యమునకు బయలుదేరి ప్రసేనుని జాడలు, అతనిని చంపిన సింహపు జాడలు,జాంబవంతుని అడుగుల జాడలు అనుసరించి జాంబవంతుని గుహకు చేరి మణిని తీయునంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణునితో యుద్ధమునకు తలపడెను. యుద్ధము అతిభయంకరముగా ఇరువది ఎనిమిది రోజులు సాగెను. మహాపరాక్రమవంతుడగు జాంబవంతుడు తన బలము క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి శరణుజొచ్చి శమంతకమణిని, తనకుమార్తె అగు జాంబవతిని శ్రీకృష్ణునికి సమర్పించెను. కృష్ణుడు ద్వారకకు చేరి ఆ మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగినదంతయు వివరించెను.
సత్రాజిత్తు తను ప్రచారము చేసిన అపవాదుకు సిగ్గుపడి తన కుమార్తె అగు సత్యభామను కృష్ణునకు సమర్పించెను. జాంబవతి, సత్యభామలను పరిణయమాడుతున్న శ్రీకృష్ణుని మునులు, దేవాదులు భక్తిప్రపత్తుల స్తుతించి, శ్రీకృష్ణునితో, ” మీరు సమర్ధులు గాన నీలాపనిందలు బాపుకొంటిరి. మాకేమి గతి ” అని ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు పొరపాటున చంద్ర దర్శనమయిన యెడల ఆనాడు గణపతిని యధావిధిని పూజించి ఈ శ్యమంతకమణి కధను విని అక్షతలు శిరమున దాల్చు వారు నీలాపనిందల నొందకుందురు గాక.” అని ఆనతీయ దేవాదులు సంతసించి తమనివాసములకు పోయి ప్రతి సంవత్సరము అందరు తమ తమ శక్త్యానుసారము భాద్రపద శుద్ధ్హ్హ్హ చవితి నాడు గణపతిని పూజించి అభీష్టసిద్ధిగాంచుచు సుఖముగా నుండిరి. శాపమోక్షప్రకారము వినాయక వ్రతకధను సూతుడు శౌనకాదిమునులకు వినిపించి తన నిజాశ్రమమునకరిగెను.

వినాయక వ్రత మహిమ:


ఈవ్రతమును అన్నికులములవారు, స్త్రీపురుషులెల్లరూ చేయవచ్చును. భక్తిశ్రద్ధలతో చేసినచో వినాయకుడు వారివారి ప్రయత్నములను సఫలమొనర్చి, విజయము చేకూర్చును. ఈ వ్రతమును చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యమును,దమయంతి నలుని పొందిరి. వృత్రాసురుని చంపినపుడు ఇంద్రుడు, సీతను వెదకునపుడు శ్రీరాముడు, గంగను భువికి తెచ్చునపుడు భగీరధుడు, క్షీర సాగర మధనము చేయనపుడు దేవాసురులు, కుష్టు వ్యాధి నివారణకై సోమదేవ మహారాజు ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములో అఖండ విజయమును పొందిరి. అటులనే ఏదేని బృహత్కార్యము తలపెట్టినపుడు వరసిద్ధి వినాయక వ్రతమొనరించి కార్యోన్ముఖులైనచో తప్పక విజయము సాధింతురు. వినాయక
చవితి రోజున చంద్రదర్శనదోషమును పోగొట్టుకొనుటకు ఈ క్రింది శ్లోకము జపించవలెనని ధర్మసింధువునకు ఆదేశము కలదు.
శ్లో: సింహ: ప్రసేనమవధీత్ సింహా జాంబవతాహతా: సుకుమారక మారోధీ: తవహ్యేష శమంతక:
శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకధ సమాప్తము.
స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీశా: గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం లోకా స్సమస్తా స్సుఖినో భవంతు.
మంగళం మహత్
(కధారంభమున పట్టుకొనిన అక్షతలు శిరస్సున ధరించవలెను.)